ఆర్టీసీ సర్వీసులు నడవడంలో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రయాణికులకు శాపంగా మారింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు సరిహద్దు వరకు బస్సులు నడుపుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరం చేరవేయడానికి షేర్ ఆటోలు నడుపుతున్న వారు 50 రూపాయల వంతున వసూలు చేస్తున్నారు.
భారం మోయలేనిదే అయినప్పటికీ.. గత్యంతరం లేక ప్రజలు వాటిని ఆశ్రయిస్తున్నారు. అవకాశం ఉన్నవారు ఎప్పటిలాగానే సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళుతున్నారు గానీ.. అందరికీ యాతన తప్పడం లేదు.
పండుగ వేళ.. భలే దెబ్బ వేశారే!
దసరా పండుగ వచ్చేసింది. ఏటా ఈ సమయంలో దూరప్రాంతాలకు ఎన్ని ప్రత్యేక బస్సులను నడపాలన్న దానిపై ఆర్టీసీ అధికారులు లెక్కలు వేసుకునేవారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అన్‌లాక్‌ల పుణ్యమా అని కొద్దికాలంగా జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ఈ క్రమంలో దూరప్రాంతాలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు బస్సులు రాకపోకలు సాగించే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసుల ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన వారికి నిరాశే మిగిలింది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రయ్ రయ్ మని తిరగొచ్చని రెండు రాష్ట్రాల ఉద్యోగులు అనుకున్నారు కానీ మరోసారి ఉన్నతాధికారుల టెలికాన్ఫరెన్స్ చర్చల్లో పురోగతి లేదని తెలుస్తోంది.
1 లక్షా60 వేల కిలో మీటర్లకు రూట్ మ్యాప్ ను తయారు చేసి తెలంగాణా ఆర్టిసీ అధికారులకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు పంపించారు. మొదట 2 లక్షల 60 వేల కిలోమీటర్లు తిప్పుతామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఆఎస్ ఆర్టీసీకి ప్రతిపాధనలు చేశారు. ఎపిఎస్ ఆర్టీసీ ప్రతిపాదనను టీఎస్.ఆర్టీసీ అంగీకరించకపోవడంతో 2 లక్షల 8 వేల కిలోమీటర్లు తిప్పుతామని తర్వాత జరిగిన చర్చల్లో ఎపీఎస్ ఆర్టీసీ తెలియజేసింది. అందుకు కూడా టిఎస్ ఆర్టిసి అంగీకరించకపోవడంతో పాటు..టీఎస్.ఆర్టీసీ ఏపీలో 1 లక్షా60 వేల కిలో మీటర్లు తిప్పినప్పుడు ఏపీఎస్.ఆర్టీసీ సైతం తెలంగాణాలో కూడా లక్షా అరవైవేల కిలోమీటర్లు మాత్రమే తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీకి స్పష్టం చేసింది.
ఎట్టకేలకు 1 లక్షా 60 వేల కిలోమీటర్లు తిప్పేందుకు ఎపీఎస్ఆర్టీసీ అంగీకరించడంతో పాటు.. మరో సారి రూట్ మ్యాప్ తయారు చేసి టీఎస్ ఆర్టీసీకి అందజేసినట్లు తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రూట్ పై స్పష్టత వస్తే.. రెండు, మూడు రోజుల్లో ఎపి, తెలంగాణా మధ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రెండు రోజులుగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశం కొలిక్కివచ్చినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అంగీకరిస్తే..ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీ అధికారుల వాదన మరోలా ఉంది. తాము నష్టపోయిన పర్వాలేదు రెండు రాష్టాల ప్రజలు ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడరాదని అంటున్నారు. తాము తెలంగాణ ప్రభుత్వంకు అందజేసిన నివేదిక పై త్వరగా నిర్ణయం తీసుకుంటే ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఏపీ అంటోంది.
ఇక ఎంత చేసినా నిరాశే
ఇప్పటికిప్పుడు ఇరురాష్ట్రాలు బస్సులు నడపడానికి నిర్ణయం తీసుకున్నా సరే.. అది ప్రయాణికులను, ప్రజలను తీవ్రంగా నిరాశపరచినట్లే. సాధారణంగా.. విజయదశమి పండుగకు చాలారోజుల ముందే ప్లాన్ చేసుకుని.. అందరూ స్వగ్రామాలకు వెళుతుంటారు. అలాంటిది ఆదివారం విజయదశమి కానుండగా.. ఇప్పటిదాకా ఆర్టీసీ బస్సుల పంచాయతీ తేలకపోవడం ప్రజలకు తీవ్రమైన నిరాశ. ఇప్పుడిక వీరు తమ చర్చలను ఒక కొలిక్కి తెచ్చినాసరే.. ప్రజలకు పెద్ద ప్రయోజనం లేదు. స్వగ్రామాలకు విధిగా వెళ్లి తీరాఅని అనుకునే అందరినీ ప్రెవేట్ ట్రావెల్స్ ఇప్పటికే దారుణంగా దోచేసుకున్నాయి. వీరి నిర్ణయం తేలేలోగా.. పండగ కూడా పూర్తయిపోతుంది.











