కోన వెంకట్ ఎన్నో సినిమాలకి కథలను అందించారు .. సంభాషణలను సమకూర్చారు. కోన కథ అంటే మినిమం గ్యారంటీ ఉంటుందనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించారు. ఆ తరువాత ఆయన ‘గీతాంజలి’ సినిమా నుంచి నిర్మాతగా కూడా మారారు. అప్పటి నుంచి తను సిద్ధం చేసిన కథలకు తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు .. ఒక్కోసారి నిర్మాణ భాగస్వామిగా మారుతున్నారు. అయితే రచయితగా పెద్ద హీరోల సినిమాలకి పనిచేసిన కోన, నిర్మాతగా చిన్న సినిమాలకి మాత్రమే పరిమితమయ్యారనే టాక్ ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.
“ఒక రచయితగా నాకు తొంభై శాతం సక్సెస్ రేట్ ఉంది. నా సినిమాలకి పనిచేసిన హీరోలందరితోను నాకు మంచి స్నేహం ఉంది. ఆ హీరోలకు కాల్ చేసి మాట్లాడేంత చనువు కూడా ఉంది. నేను ఒక కథ వినిపిస్తే .. వాళ్లకి నచ్చితే దానిని చేయడానికి వాళ్లు వెంటనే అంగీకరిస్తారు. ఆ విషయంలో వాళ్లు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. కానీ ఒక రచయితగానే కాకుండా నిర్మాతగా కూడా చేస్తానని చెప్పి వాళ్ల స్నేహాన్ని వాడుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందువలన నేను ఒక నిర్మాతగా పెద్ద హీరోల జోలికి ఎప్పుడూ వెళ్లలేదు”.
“పెద్ద హీరోలకు డేట్స్ సమస్య ఉంటుంది .. ముందుగానే వాళ్లు కొన్ని ప్రాజెక్టులు కమిట్ అవుతారు. మనవంతు వచ్చేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ వెయిట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందువలన నేను పెద్ద హీరోలను అనుకుని కథలను రాయడం లేదు. పవన్ కల్యాణ్ మాత్రం డేట్స్ ఇస్తాను .. సినిమా చేసుకో అన్నారు. మంచి కథ రాసుకుని .. యంగ్ డైరెక్టర్ ను పెట్టుకుని సినిమా చేసుకో అని చెప్పారు. కానీ పవన్ రేంజ్ కి తగినట్టుగా కథ రెడీ చేయడమనేది అంత తేలికైన విషయమేం కాదు. మంచి పాయింట్ తడుతుందేమోనని చూస్తున్నాను. పవన్ మాత్రం గుర్తుపెట్టుకుని తరచూ అడుగుతూనే ఉన్నారు. చూడాలి .. పవన్ తో ఎప్పుడు చేస్తానో” అని చెప్పుకొచ్చారు.