వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. సరస్వతీ పవర్‌ప్లాంట్ కోసం కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలోని 20 ఎకరాలు, పిన్నెల్లిలో మరో 4.84 ఎకరాల భూమిని అసైన్డ్ భూమిగా గుర్తించింది కూటమి ప్రభుత్వం.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం 1516 ఎకరాల భూమి కేటాయించారు. ఐతే ఈ భూముల్లో ఇప్పటివరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. పైగా ఈ భూముల్లో అటవీ, అసైన్డ్ భూములున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ భూములు ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఈ భూముల్లో రీ సర్వేకు ఆదేశించారు. అంతేకాకుండా అసైన్డ్, అటవీ భూములు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు ఇటీవల ఈ భూముల్లో సర్వే నిర్వహించారు.
ఈ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన మాచవరం తహసీల్దార్ క్షమారాణి కలెక్టర్‌కు నివేదిక అందించారు. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు. తాజాగా కలెక్టర్ అనుమతితో మొత్తం 24.85 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు క్షమారాణి వెల్లడించారు. జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. స్వదేశానికి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.