గతకొద్ది రోజులుగా ఏపీలో లోకేష్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్నా, మొన్నటి వరకు లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీలో బలమైన డిమాండ్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ అంశంపై నేరుగా ఎక్కడా స్పందించలేదు చంద్రబాబు. పార్టీ నేతలకు మాత్రం డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఐతే ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనయుడు లోకేష్ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సినిమాలు, రాజకీయం, కుటుంబం, వ్యాపారం ఇలా ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని స్పష్టం చేశారు చంద్రబాబు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని, ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు.
వ్యక్తిగతంగా తాను ఏనాడూ జీవనోపాధి కోసం రాజకీయాల మీద ఆధారపడలేదన్నారు చంద్రబాబు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించామని చెప్పారు. వ్యాపారం లోకేష్‌కు చాలా తేలికైన పని అని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రస్తుతం ప్రజాసేవలో లోకేష్ సంతృప్తి పొందుతున్నారని చెప్పారు. రాజకీయాల్లో వారసత్వం అంటూ ఏం ఉండదన్నారు.
లోకేష్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి తాను కేంద్రంలోకి వెళ్తానంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్లారిటీ ఇచ్చారు బాబు. తనకు కేంద్రమంత్రి కావాలన్న ఉద్దేశం లేదన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.