ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన టీమ్ దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏపీలో పెట్టుబడుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలకు పోటీగా అమరావతిని తయారు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం తరపున అందించే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు.
ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో దావోస్‌లో భేటీ అయ్యారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించిన చంద్రబాబు..బిల్‌గేట్స్ సహకారం కోరారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ గురించి బిల్‌గేట్స్‌కు వివరించారు. ఈ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామి కావాలని బిల్‌గేట్స్‌ను కోరారు. ఏపీలోనూ గేట్స్ ఫౌండేషన్ తరపున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు విజ్ఞప్తిపై బిల్‌గేట్స్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ భేటీ తర్వాత ఆసక్తికర ట్వీట్ చేశారు చంద్రబాబు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బిల్‌గేట్స్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 2025లో బిల్‌గేట్స్ కలిసినట్లు ట్వీట్ చేశారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ గేట్స్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు. టెక్నాలజీ విషయంలో చంద్రబాబు మిగిలిన ముఖ్యమంత్రులతో పోలిస్తే ఓ అడుగు ముందే ఉంటారు. భవిష్యత్ అంతా ఏఐదేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.