నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్రాంతీయ సినిమా మార్కెట్ పై దృష్టి సారించింది. తాజాగా దగ్గుబాటి రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ హక్కుల్ని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ ఏడాది పావ కథైగల్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణ అండ్ హిజ్ లీల, అంధకారం లాంటి చిత్రాలను ఈ సంస్థ విడుదల చేసింది. వచ్చే ఏడాది మరింత దూకుడు పెంచే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగానే ‘విరాటపర్వం’ హక్కుల్ని సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యాకే సుమా.
వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రానా సరసన సాయిపల్లవి నటిస్తోంది. సాయిచంద్, నందితా దాస్, జరీనా వహాబ్, ప్రియమణి తదితరులు ఇతర పాత్రల్ని పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే ఓటీటీలో విడుదలవుతుంది.
ఇటీవల కాలంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రాలుగానీ, పంపిణీ చేసిన సినిమాలు గానీ బాగా ఆడాయి. ఓబేబీ, కేరాఫ్ కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది?, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో ఈ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు దగ్గరైంది. వీటితో పోలిస్తే ‘విరాటపర్వం’ పరిధి పెద్దది. బడ్జెట్ పరంగా చూసినా, స్టార్ వాల్యూ పరంగా చూసినా ఇది పెద్ద సినిమా పరిధిలోకి వస్తుంది. నక్సల్ ఉద్యమం నేపథ్యంలోని కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read: మెగాస్టార్ మూవీలో దగ్గుబాటి హీరోనా?