(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆ పథకాన్ని అప్ గ్రేడ్ చేశారు. సహజంగానే పేరు మార్చారు. పోషణ్ అభియాన్ కాస్తా.. వైఎస్సార్: సంపూర్ణ పోషణ పథకం అయింది. పేరు మార్చి పథకం అప్ గ్రేడ్ అయితే మంచిదే. తద్వారా మరింత మందికిి ప్రయోజనం ఒనగూరితే ఇంకా మంచిది. కానీ.. ఈ లోగా.. కేంద్రపథకం అమలలో భాగంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగల నోట మన్ను పడింది. తమ బతుకులు బజార్న పడ్డాయని వారిప్పుడు ఆందోళనలు చేస్తున్నారు.
ఏం జరిగింది..?
గడువు ముగియకముందే ఉద్యోగాల నుంచి తొలగించడంపై పోషణ అభియాన్ సిబ్బంది గుంటూరు అమరావతి రోడ్డులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. 13 జిల్లాల నుంచి 340 మంది పోషణ్ అభియాన్ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని పోషణ్ అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఏమిటీ పోషణ్ అభియాన్?
గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాలు లేకుండా చూసేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గర్భిణీలు, బాలింతలకు రెండు సంవత్సరాలపాటు సంపూర్ణ పోషణకు అవసరమైన ఆహారం అందిస్తారు. ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలవుతోంది.
మన రాష్ట్రంలో ఈ పథకం కింద 340 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పథకాన్ని వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ పథకంలో చేర్చారు. దీంతో కేంద్ర పథకాన్ని అమలు చేస్తున్న 340 మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో పోషణ్ అభియాన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
సెప్టెంబర్ 7న ప్రారంభమైన వైఎస్సార్ సంపూర్ణ పోషణ
రాష్ట్రంలో ఇప్పటికే నడుస్తోన్న అంగన్ వాడీ కేంద్రాలను, పోషణ్ అభియాన్ పథకాలను కలపి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైెఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7న ప్రారంభించారు. ఏటా రూ.1850 కోట్ల వ్యయంతో 5 సంవత్సరాలలోపు పిల్లలతోపాటు, గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ పోషణకు అవసరమయ్యే ఆహారం ఈ పథకం ద్వారా అందించనున్నారు.
ఈ వ్యవహారాలను అంగన్వాడీలు చూస్తున్నారు. రెండు పథకాలు కలిపివేయడంతో, పోషణ్ అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను అర్ధంతరంగా తొలగించారు. దీంతో 340 మంది పోషణ్ అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
మా కడుపు కొట్టొద్దు : జగన్ కు విజ్ఞప్తి
పేదల మహిళల కడుపు నింపే తమను ఉద్యోగాల నుంచి తొలగించి తమ కడుపు కొట్టొద్దని పోషణ్ అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు కన్నీటి పర్యతం అవుతున్నారు. అర్ధంతరంగా తమ ఉద్యోగాలు తొలగిస్తే ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తమను టీచర్లుగా నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.











