తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఖరి వింతగా ఉంటోంది. ఒకరు అవునంటే… మరొకరు కాదంటున్నారు. ఒకరు పువ్వులు చల్లుతూంటే… మరొకరు రాళ్లు విసురుతున్నారు. ఒకరు ప్రేమ అంటే.. మరొకరు పగ అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి మీద అనుకుంటున్నారా… ఇంకెవరు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపైనే.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఖరి ఒకరికి మరొకరి సంబంధం లేకుండా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సోమవారం నాడు జరిగింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ ఎన్నికను వాయిస్ఓట్ ద్వారా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ గెలిచారు.
ఈ ఎన్నికలను తెలంగాణా రాష్ట్ర సమితి బహిష్కరించింది. కేంద్రం వైఖరికి నిరసనగా తాము ఎన్నికల్లో పాల్గొనడం లేదని టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. కరోనా సాయంతో పాటు జీఎస్టీ బకాయిలు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందని, అందుకే తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం లేదంటూ ప్రకటించింది. తాము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తాం కాబట్టి ఆ పార్టీ అభ్యర్ధికి మద్దతు పలకలేమని ప్రకటించారు.
ఇక పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరుపై కూడా తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టమైన వైఖరినే తీసుకుంది. కేంద్రానికి వ్యతిరేకంగా సభలో మాట్లాడాలని, జీఎస్టీ బకాయిలు రాబట్టుకోవడంతో పాటు కరోనా అంశంలో కేంద్రం తెలంగాణాకు చేసింది ఏమి లేదని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.
ఏపీ రూటు సపరేటు…
ఇక పార్లమెంట్ లో వ్యవహరించే తీరుపై ఆంధ్రప్రదేశ్ రూటు సపరేటుగా ఉంది. ఈ వర్షాకాల సమావేశాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎంపీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, కేంద్రాన్ని ఇరుకున పెట్టకుండా పనులు జరిపించుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు ఇతర అంశాలపై ఆచితూచి వ్యవహరించాలని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు భావిస్తున్నారు. “తాము అధికార పక్షానికి మిత్రపక్షంగానే వ్యవహరిస్తాం కాని, ప్రతిపక్షంలా మాత్రం కాదు“ అని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం, ఇక్కడి తెలుగు వారి కోసం కలిసి కార్యక్రమాలు చేయాలి కాని ఇలా విడివిడిగా ఉండడం ఏమిటని ఇతర పక్షాల వారు అంటున్నారు.
ఒకరు ఘర్షణతో వ్యవహరించినంత మాత్రాన వారికి మేలు జరుగకుండా పోదని, అలాగే కేంద్రానికి అనుకూలంగా ఉంటే ఎక్కువ మేళ్లు జరుగుతాయని భావించడం తప్పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి తన వైపు నుంచి సాయం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఆయన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం వారు విడివిడిగా వ్యవహరించడం కంటే ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇద్దరూ ముఖ్యమంత్రులు కలిసి పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.











