మాజీ మంత్రి ఆర్కే రోజా జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పేసిందా? అంటే ఔననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి రోజా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైసీపీని గానీ, జగన్ ను కానీ ఫాలో అవుతున్నట్లు కనిపించడం లేదు. సోషల్ మీడియా అన్ ఫాలో కొట్టేయడమే కాక, తాను జగన్ తో దిగిన ఫోటోలను కూడా తీసేశారు. కేవలం తన బయోలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని మాత్రమే రాసుకున్నారు. సెలబ్రిటీ భార్యాభర్తలు ఎవరైనా తమ విడాకుల గురించి హింట్ ఇవ్వాలనుకుంటే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుంటారు. తమ జంట ఫోటోలను తీసేయడం చేస్తారు.
సరిగ్గా అలాగే ఇప్పుడు నటి, రాజకీయ నాయకురాలు రోజా కూడా అదే చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తీసేశారు. దీనిపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. నగరి ఇంచార్జ్ గా రోజా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా పోటీచేసి ఓడిపోయిన వారంతా అక్కడ ఇంచార్జులుగా ఉంటారు. కానీ రోజా పార్టీ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో హైకమాండ్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదట. కేవలం రోజా వల్లనే నగరి వైసీపీ భ్రష్టుపట్టిపోయిందని.. ఆమెను వదిలించుకోవడమే మంచిదనే ఆలోచనతో పార్టీకి దూరంగా ఉండాలని జగన్ కూడా భావిస్తున్నారని అంటున్నారు. కనీసం సమావేశాలకు ఆహ్వానం కూడా ఇవ్వడం లేదని తెలిసింది. అందుకే కోపంతో ఇలా చేశారన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు, ఆమె ఇక ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో మంచి స్థానానికి వెళ్లి, తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకున్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మరో పార్టీకి వెళ్దామంటే దారి కూడా లేదు. తన నోటి దురద కారణంగా.. ప్రత్యర్థి పార్టీల నేతలను అనరాని మాటలతో దూషించి, అపఖ్యాతి మూటగట్టుకున్నారు రోజా. కాబట్టి, ఆమెకు ఏ పార్టీలోకి ఎంట్రీ లభించే అవకాశమే లేదు.
కాబట్టి, రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, తమిళ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్ కొత్తగా ప్రకటించిన తమిళగ వెట్రి కజగంలో చేరొచ్చనీ అంటున్నారు. పైగా ఈ మధ్య తమిళనాట ఉండే ఆలయాల్లో రోజా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవలే తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావడిని సమర్పించారు. రోజాకు తెలుగుతో పాటు తమిళం కూడా పర్ఫెక్టుగా వచ్చు. సినిమాల ద్వారా తమిళ రాజకీయాలకు సుపరిచితమే. కాబట్టి, ఇక రాజకీయ భవిష్యత్తు క్లోజ్ కావడంతో తమిళ రాజకీయాల్లోకి పోతున్నారని అంటున్నారు.











