పురస్కారాలు మన ప్రతిభకు కొలమానం కాకపోయినా చేసిన సేవకు గుర్తింపు లభిస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. మన దేశంలో ప్రతిష్టాత్మక పురస్కారాలలో ప్రధానమైనవి పద్మ పురస్కారాలు.
పద్మ విభూషణ్, పద్మభూషణ్ తర్వాత స్థానంలో పద్మశ్రీ పురస్కారం ఉంటుంది. భారత ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి పురస్కారం లభిస్తే ఆ సినిమా ప్రముఖులు పులకించిపోతారు. కొంతమందికి మరణానంతరం ఇలాంటి పురస్కారాలు లభిస్తుంటాయి. ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం ఇవ్వాలన్న ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉంది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం ఇది. అదే జరిగితే యావత్ తెలుగుజాతి పులకించిపోతుంది. ఈసారి పద్మ పురస్కారాలు లభించిన సినీ ప్రముఖుల్లో షావుకారు జానకి, సోనూ నిగమ్ లాంటి వారు ఉన్నారు. నిజానికి షావుకారు జానకికి ఇలాంటి పురస్కారం ఎప్పుడో లభించి ఉండాలి.
షావుకారు జానకి సినీయానం..
ఆమె తెలుగు, తమిళ, కన్నడం, మలయాళంలో దాదాపు 400 సినిమాల్లో నటించారు. వీటిలో హీరోయిన్ గానే 200 సినిమాల్లో చేశారు. ఈరోజుల్లో హీరోయిన్ గా 20 సినిమాలు చేయడమే కష్టం. మరో విషయం ఏమిటంటే ఆమెకు ఈ పురస్కారం ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆమె అనేక తెలుగు సినిమాల్లో నటించినా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఆమె పేరును సిఫార్సు చేయాలన్న ఆలోచన రాలేదు. పైగా ఆమె తెలుగు వ్యక్తి. ఆమె నటించిన తొలి సినిమా పేరు ‘షావుకారు’ ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.
ఇప్పుడు ఆమె వయసు 90 ఏళ్లు. ఆమె నటజీవితం దాదాపు 70 ఏళ్లు. ఇంత సుదీర్ఘ నటజీవితం ఉన్న నటీమణులు అరుదు. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్,జెమినీ గణేశ్ లాంటి దిగ్గజ నటులతో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. రేడియో కళాకారిణిగా, నట్య కళాకారిణిగా, నటిగా కళా రంగానికి ఆమె ఎంతో సేవ చేశారు. ఆమె సొంతూరు తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం. చిన్నప్పుడే సంప్రదాయ నృత్యం నేర్చుకున్నారు. నాట్య రంగంలో కొనసాగుతున్నప్పుడే బి.ఎన్. రెడ్డి దృష్టిలో పడ్డారు. ఆయన స్వర్గసీమ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆ సినిమా చేయలేకపోయారు.
ఆ తర్వాత నాగిరెడ్డి – చక్రపాణి తాము తీసే షావుకారు సినిమాకి ఆమెను ఎంపిక చేశారు. హీరోగా ఎన్టీఆర్ కు ఇది రెండో సినిమా. దీనికి ఎల్వీ ప్రసాద్ దర్శకుడు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఒకే సంవత్సరం దాదాపు 11 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత ఆమెకు ఉంది. తమిళ దర్శకులు కూడా ఆమెను ప్రోత్సహించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. వయసు పైబడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కొనసాగారు. 90 ఏళ్ల వయసులో కూడా ఆమె నటిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. తనలో శక్తి ఉన్నంతవరకూ నటిగా కొనసాగాలని ఆమె అంటుంటారు. ఆమె పద్మశ్రీ లభించిన సందర్భంగా సినీ ప్రముఖులంతా ఆమెను ప్రశంసించారు.
సోనూ నిగమ్, మొగులయ్య పాటల ప్రయాణం
పాటల ప్రయాణంలో సాగుతూ ఎన్నో మధురమైన గీతాలను అందించిన సోనూ నిగమ్ కు కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు కన్నడ, మలయాళ, తమిళ, బెంగాలీ, భోజ్‌పురి, తుళు లాంటి భాషల్లోనూ పాటలు పాడారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఎన్నో షోలకు జడ్జిగానూ వ్యవహరించారు. దాదాపు ఐదు వేలకు పైగా పాటలు పాడారు. దేశవిదేశాల్లో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు.
ముఖ్యంగా మెలోడీ పాటలకు ఆయన పెట్టింది పేరు. ఇక తెలంగాణ గడ్డ మీదికి వస్తే కిన్నెర మొగులయ్యను కూడా ఈ పురస్కారం వరించింది. ఆయన సినిమా రంగానికి సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో ఆయన పేరు తెలుగు నాట మార్మోగింది. 12 మెట్ల కిన్నెర పాటలతో ప్రయాణం సాగించిన మొగులయ్యలోని ప్రతిభను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. ఏటా ఇలాంటి కళాకారులను పద్మ పురస్కారాలతో సత్కరించుకోవడం మన జాతికే గర్వకారణం.











