గన్నవరం సమీపంలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాధాశ్రమంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి బట్టలు విప్పించి, సీనియర్ విద్యార్ధి యశ్వంత్ కర్రలతో కొట్టారు. ఈ ఘటనను వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. క్రిస్మస్ వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బుజ్జల అన్నజోలికి ఎవరైనా వెళితే ఇదే గతి పడుతుందని యశ్వంత్ గ్యాంగ్ హెచ్చరిస్తున్న వీడియో కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అనాధాశ్రమం యాజమాన్యం చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.
పట్టించుకోని పోలీసులు
గన్నవరం సమీపంలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాధాశ్రమంలో ర్యాగింగ్ కలకలం రేపినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం దీనిపై ఇంత వరకు కేసు కూడా నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ర్యాగింగ్ నిరోధించేందుకు కఠన చట్టాలు తెచ్చినా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసులు, కాలేజీ యాజమాన్యాలు ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.