రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు ఉంది. ఆయన రచయితగా పనిచేసిన అనేక చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. కోన వెంకట్ కథ అంటే ఆ సినిమాలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి వచ్చేసింది. అందువలన ఆయన సినిమాలను వాళ్లు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా కూడా మారారు. వైవిధ్యభరితమైన కథలను రెడీ చేసుకుని, ఒక మాదిరి బడ్జెట్ లో ఆయన తన సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. అలా తాజాగా ఆయన ‘రౌడీ బేబీ’ సినిమాను నిర్మిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమాను గురించి ప్రస్తావించారు.
‘నిశ్శబ్దం’ తరువాత సినిమాగా ‘రౌడీ బేబీ’ని నిర్మిస్తున్నాను. ఇటీవలే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాము. ఈ సినిమా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే చిత్రీకరిస్తున్నాము .. అదే ఈ సినిమా స్పెషాలిటీ. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయిలో అక్కడ షూటింగు జరుపుకోనున్న తొలి సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. కథను బట్టి ఈ సినిమా షూటింగును మొదటి నుంచి చివరివరకూ అక్కడే చిత్రీకరించనున్నాము. హైదరాబాద్ లో ఒక సినిమా చేయాలంటే లొకేషన్స్ పరంగా ఆయా రంగాలకు సంబంధించిన అనుమతులకు చాలా ఖర్చు అవుతోంది. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లొకేషన్స్ కు ఎలాంటి ఛార్జ్ చేయవలసిన అవసరం లేకపోవడం నిర్మాతలకు కలిసొచ్చే అంశం” అని అన్నారు.
కోన వెంకట్ సినిమా అనగానే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. ‘నిశ్శబ్దం’ సినిమా కూడా, ‘గీతాంజలి’ మాదిరిగా హారర్ కామెడీ అనుకున్నారు. కానీ ఆ సినిమా సీరియస్ గా సాగే సరికి వాళ్లకి ఎక్కలేదు. నా నుంచి వాళ్లు ఆశించిన కథను నేను ఇవ్వకపోవడంతో వాళ్లు రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఈ సారి వాళ్లకి నచ్చే కథనే సిద్ధం చేసుకున్నాను. ‘రౌడీ బేబీ’ సినిమా ఒక ‘వెంకీ’ .. ‘ఢీ’ సినిమాల మాదిరిగానే మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తూనే ఉంటుంది. కోన వెంకట్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం పూర్తిస్థాయిలో ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.