రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటివరకు 836 వివిధ రకాల చికిత్సలను చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటితోపాటు మరో 683 చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం వీటి సంఖ్య మొత్తం 1,519కి చేరింది. ఈ చికిత్సలలో వేటినైనా చేయించుకుని ఇంటి వద్ద కోలుకునేవారికి రోజుకు 225 రూపాయిల చొప్పున నెలకు 5 వేల వరకు ప్రభుత్వం అందిస్తుంది. అది చికిత్సని బట్టి అందేలా ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. ఇక నుండి ఇది కొత్త చికిత్సలకు కూడా అమలయ్యేలా చూసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు అందించింది.
ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు జత చేస్తే సరి..
చికిత్స తర్వాత కోలుకుంటున్న సమయంలో రోగులకు అందాల్సిన సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ డబ్బు రోగులకు ఎన్ని నెలలు అందివ్వాలనే విషయం డాక్టర్ నిర్దేశించిన విశ్రాంతి సమయం, కోలుకునే సమయం పైన ఆధారపడి ఉంటుంది. ఇక తాజాగా జత చేసిన వాటిలో గైనకాలజీ, డయాబెటిక్, పల్మనరీ, డెంగీ జ్వరాలు వంటి వాటిని చేర్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం చికిత్స తీసుకోవడానికి నిర్ణయించిన రోగుల ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు జత చేసి వివరాలను అందిస్తే చాలు.. చికిత్స అనంతర సొమ్ము రోగుల ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం.