(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి అప్రతిహత విజయంతో జాతీయపార్టీగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలించి సిక్కోలు నుండి సింహపురి వరకు తన వాణిని వినిపించి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ 2019లో ఘోరపరాజయం చవి చూడటంతో ఆ పార్టీ అధినాయకుని నుండి సాధారణ కార్యకర్త వరకు తల్లడిల్లారు. ఆ పరిస్థితి నుండి బయట పడేందుకు, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధినాయకుడు చంద్రబాబు నాయుడు అనేక కసరత్తులు చేసి, ఏర్చికూర్చి, సీనియర్లు, జూనియర్లతో పాటు సామాజిక వర్గ ప్రాతిపదికన సమతూకం పాటించి జాతీయ స్థాయి కొత్త కమిటి ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది సీనియర్లు తమకు ఆశించిన ప్రాధాన్యత ఇవ్వలేదని నిరసన స్వరం వినిపిస్తున్నారు. ‘పెదవులతో పలకరిస్తూ .. కనులతో వెక్కిరించే’ విధంగా ఆ పార్టీ కొందరు సీనియర్ల పరిస్థితి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాటమాత్రమైనా చెప్పలేదు
జాతీయస్థాయి కమిటీలో ప్రాధాన్యత కల్పించినప్పటికీ తమకు మాటమాత్రమైనా చెప్పలేదని కొందరు, పార్టీకి అత్యంత కీలకమైన పోలిట్‌బ్యూరో నుండి తప్పించారని మరికొందరు, అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని అందలం ఎక్కించారని ఇంకొందరు, అన్నివేళలా పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ సముచిత స్థానం కల్పించలేదని మరికొందరు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ‘ పోలిట్‌బ్యూరో నుండి తనను తప్పిస్తున్నప్పుడు మాటమాత్రంగానైనా చెప్పలేదు. సెంట్రల్ కమిటీలో ఇచ్చిన ఉపాధ్యక్ష పదవి వల్ల ఉపయోగమేంటి. పార్టీ పరిస్థితి అర్థం కావడం లేదు’ అంటూ టీడీపీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, మాజీమంత్రి కావలి ప్రతిభా భారతి తన అత్యంత సన్నిహితుల దగ్గర వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
గుమ్మడి నియామకంపై విస్మయం
టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకునిగా, కేంద్ర , రాష్ట్ర మంత్రిగా, సీనియర్‌గా పేరుగాంచిన అశోక్ గజపతి రాజుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కూర్పు అంతుపట్టడం లేదని అత్యంత విశ్వసనీయ సమాచారం. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని పోలిట్‌బ్యూరో సభ్యురాలుగా నియమించడంలో ఆంతర్యం అశోక్‌తో పాటు జిల్లా టీడీపీ వర్గాలకు అంతుపట్టడం లేదు. ఎమ్మెల్యేగా గెలవలేని ఆమెను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా నియమించడమే ఎక్కువ అనుకుంటుంటే, ఏకంగా పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమించడం ఆ పార్టీ కేడర్‌లో విస్మయం కలిగించగా జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది.
పక్కపార్టీల వైపు చూస్తున్నవారికి ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీలో ఉంటూ పక్క పార్టీల వైపు చూస్తూ, వారి పిలుపు కోసం వేచివున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కె.ఇ.కృష్టమూర్తి, కె. ప్రతిభా భారతి, గుమ్మడి సంధ్యారాణి లాంటి వారికి పార్టీలో కీలక పదవులు ఇవ్వడం ఒక రకమైన వ్యూహాత్మకమా లేదా తప్పిదమా అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
కష్టకాలంలో ఉన్న టీడీపికి అండగా నిలిచి పార్టీ విజయానికి, పూర్వ వైభవానికి కృషి చేయాల్సిన సీనియర్లు ఎడమొఖం .. పెడమొహంగా వ్యవహరిస్తుండటంపై ఆ పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.