రష్మిక మందణ్ణ తెలుగులో వరుస సినిమాలను చేస్తూ సందడి చేస్తోంది. స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు అందరితోనూ నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుంది. ఇప్పుడు ఈ లక్కీ హీరోయిన్ మరో సినిమాకి కమిట్ అయిందని టాక్. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈసినిమాకు ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని తీసిన సుధాకర్ చెరుకూరి తన ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంభందించిన విషయాలను ఈనెల 25వ తేదీన తిరుపతిలో ప్రకటించి, అక్కడే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకు రాష్మిక అయితే సరిగ్గా సరిపోతుందని దర్శకుడు కిషోర్ ఆమెను సెలెక్ట్ చేశాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ శర్వానంద్ తో కలిసి నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా కథ విషయాన్ని వస్తే ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉంటుందని అందుకనే రష్మికను సెలెక్ట్ చేసారని టాక్ . ఈ సినిమాలో రష్మిక పాత్ర కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కు ఉన్న ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.











