తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వామపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల స్థానంలో తమ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపిన వామపక్షాలు పార్టీలకు పూర్వ వైభవం తీసుకువచ్చే పనిలో పడ్డాయి. గతంలో ఈ జిల్లాల్లో పార్టీలు బలంగా ఉండేవి. ప్రతి జిల్లాలో తమ ప్రాతినిథ్యం ఉండేది. గత ఎన్నికల వరకు పార్టీకి ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే ప్రాతినిథ్యం ఉండేది. అయితే 2018 ఎన్నికల తరువాత వామపక్షాల ప్రభావం పూర్తిగా పడిపోయింది. ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా సొంతం చేసుకోలేక పోయారు. దీంతో ఆ పార్టీల పనైపోయిందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. పార్టీల మాజీ ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆ పార్టీల్లో బలమైన నేతలు లేకుండా పోయారని, కనీసం ఎన్నికల బరిలో నిలిచేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారని ఇతర పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
రంగంలో ఉమ్మడి అభ్యర్థి
ఈ అపప్రద నుంచి బయటపడే పనిలో పడ్డాయి వామ పక్షాలు . ఈ మూడు జిల్లాల్లో గత ఏడాదిన్నర వరకు కూడా వారి ప్రాతినిథ్యం ఉండేది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో వారంతా అధికార పార్టీ పంచన చేరారు. అయినా పార్టీల కేడర్ మాత్రం వారి వెంట వెళ్లలేదని వామపక్ష పార్టీల యోచనగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీపీఎం , సీపీఐ పార్టీలు కలిసి ఇతర వామ పక్షాల సహకారంతో ఒకే ఉమ్మడి అభ్యర్థిని ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈ పక్షాల తరఫున మాజీ సీనియర్ జర్నలిస్ట్‌ను రంగంలోకి దింపాయి. ప్రభుత్వ విధానాలపై మంచి పట్టున్న వ్యక్తి కావడంతో పాటు ఎన్నికల్లో వ్యూహాలు రచించగల సత్తా ఉన్న వ్యక్తిగా జర్నలిస్ట్ సారథి రెడ్డిని నిలిపాయి. ఉమ్మడి అభ్యర్థి విషయంలో గతంలో లాగా నాన్చకుండా త్వరగానే తేల్చేశాయి. దీంతో ఇక విజయ సారథి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీలో పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆపార్టీల కార్యకర్తలందరినీ తట్టి లేపుతున్నారు. వామపక్ష పార్టీల్లో ఒక్కసారి పని చేసిన వారు నిబద్ధతగా పార్టీ ఎదుగుదల కోసం కష్ట పడతారు. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని సారథి పార్టీ కేడర్ కు ఉత్సాహం నూరి పోస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో పని చేసిన వారి తరహాలోనే తాను కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానంటున్నారు. ప్రభుత్వ లోటు పాట్లు మొత్తం తనకు తెలుసు కాబట్టి చట్టసభల్లోకి తనను పంపేందుకు కృషి చేస్తే బడుగు బలహీన వర్గాలకు కొంతలోకొంతైనా న్యాయం చేయగలుతానన్న నమ్మకాన్ని వాళ్ళలో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
కేడర్ యాక్టివ్ అయితే …
ఉమ్మడి అభ్యర్థి విజయ సారథి వ్యూహం ఫలిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ బలాబలాలను తెలుసుకుని విజయానికి బాటలు వేసుకుంటున్నాయి. ఇక వామపక్ష పార్టీల పూర్వ కేడర్ యాక్టివ్ అయితే ఆ పార్టీల అభ్యర్థి విజయ సారథి గెలుపు పెద్ద కష్టం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదువుకున్న, సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తిగా సారథి రెడ్డి ప్రజల్లో ఎలివేట్ అయితే గెలుపు సులువవుతుందంటున్నారు. చట్టసభల్లో ఎర్రజెండా ప్రాతినిథ్యం లేకుండా పోయిందనే బాధ ఆ పార్టీల కార్యకర్తల్లో ఉన్న నేపథ్యంలో ఒక్కరినైనా తమ నేతను అక్కడకు పంపిచాలని కసితో పని చేయడంతోపాటు సారథి తన పరిచయాలకు పని చెబితే అధికార టీఆర్ఎస్ విజయాలకు అడ్డుకట్ట వేయవచ్చని వామపక్షాలు భావిస్తున్నాయి.











