కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికీ నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేశారని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణలో తెలిసింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. శ్రీశైలం దేవస్థానం ఎప్పుడూ విజయా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసేది. కానీ ఆ 11 నెలల కాలంలో తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి 3 లక్షల 25 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేసి.. 16 కోట్లు చెల్లించారు.
రాజేశ్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి భోలేబాబా డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి కాని నెయ్యినే సరఫరా చేశారని తెలుస్తోంది. రాజేశ్ కార్పొరేషన్‌కు సొంతంగా డెయిరీ లేదు. బోలేబాబా డెయిరీ సొంతంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంతో పాటు.. తిరుపతికి చెందిన కొన్ని సంస్థల ద్వారా కల్తీ నెయ్యిని విక్రయించిట్లు సిట్ విచారణలో తేలింది. పామాయిల్‌లో రసాయనాలు కలిపి తయారు చేసిన నెయ్యిలాంటి పదార్ధాన్నే శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేయడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాలలోని విజయ డెయిరీ తక్కువ ధరకే శ్రీశైలం దేవస్థానికి నెయ్యి సరఫరా చేస్తుంది. అందుకే నెయ్యి కాంట్రాక్టు ఎప్పుడూ విజయా సంస్థకే దక్కేది. 2022లో వైసీపీ హయాంలో దేవస్థానం అధికారులకు.. విజయా డెయిరీ యాజమాన్యానికి మధ్య నెయ్యి ధరల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తెచ్చినా.. అంత తక్కువకు నెయ్యి విక్రయించలేమని విజయ డెయిరీ పక్కకు తప్పుకొంది. సరిగ్గా ఆ సమయంలో రాజేశ్ కార్పొరేషన్ ఎంటర్ అయింది. కిలో 489కే ఇస్తామనడంతో నెయ్యి కాంట్రాక్టు ఆ కంపెనీకే కట్టబెట్టారు. శ్రీశైలం దేవస్థానంలో ప్రతి రోజు లక్ష లడ్డూలు భక్తులకు అందిస్తారు. అంటే 11 నెలల్లో 3 కోట్ల 30 లక్షల లడ్డూలను కల్తీ నెయ్యితో చేశారని అర్ధమవుతోంది. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసుపై సీబీఐ సిట్ లోతుగా విచారణ చేయడంతో.. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంత పాపానికి ఒడిగట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.











