ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్‌కు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు కూటమి ఎంపీలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. తర్వాత ఎంపీలతో సమావేశమైన లోకేష్..బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రానికి అవసరమైన నిధులు, కేటాయింపులపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రకటించిన రాయితీలు, ప్రాజెక్టులు, రాజధాని అమరావతికి నిధుల అంశంపై కేంద్రమంత్రులతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నట్లు సమాచారం.
లోకేష్ వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. ఏపీలో AI కరికులమ్ అమలు, గవర్నమెంట్ స్కూల్స్‌లో రోబోటిక్స్ ల్యాబ్‌ల ఏర్పాటు , విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరనున్నారు. అలాగే, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ సహా పలు పెండింగ్ అంశాలపై కూడా లోకేష్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని వాడుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ వరుసగా ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రానికి అసరమైన నిధుల కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఉన్న గ్రామీణ తాగు నీటి సరఫరా కోసం కేంద్రం 20 వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్‌లోనూ ఏపీకి పెద్దపీట వేసింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ముందుకు సాగుతున్నారు నేతలు.










