అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవులపై కత్తి వేలాడుతుండడంతో రూటు మార్చారు. తూతూ మంత్రంగా ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్న ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యే వరుసగా 60 పని దినాల పాటు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి, కనీసం ఒక్కరోజు అంటే గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరై సంతకం చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల ఫిబ్రవరి 11 నుండి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ జంట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఉంటుంది. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు విడివిడిగా బడ్జెట్‌లను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలను కేసులు, విచారణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఎథిక్స్ కమిటీ దృష్టి సారించినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీకి రాకుండా రిజిస్టర్లలో సంతకాలు చేయడం, ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో పొందడంపై ఎథిక్స్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి తోడు పాత కేసుల్లో విచారణ వేగవంతం కావడంతో, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఇక, సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన తర్వాత డ్ బుక్ యాక్షన్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనుందని సమాచారం. ఐ-పాక్ ఆఫీసులపై ఇటీవల సోదాలు, మాజీ మంత్రుల అవినీతి చిట్టా బయటకు రావడం చూస్తుంటే, జగన్ అండ్ కో కు మరిన్ని కష్టాలు తప్పవనే విశ్లేషణలు మొదలయ్యాయి.











