ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రామతీర్థం కోదండరామాలయంలోని రాముని విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారు. సుబ్రమణ్యస్వామి విగ్రహం రెండు చేతులను దుండగులు ధ్వంసం చేయడంపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చాలా అరుదుగా ఉండే నాగబంధనసహిత సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయం రాజమండ్రిలో కొలువై ఉంది. రోజూ వందలాది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. రద్దీగా ఉంటే ఇలాంటి దేవాలయాలపై కూడా దాడులు చేయడం, విగ్రహాలు ధ్వంసం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేవాలయాలపై దాడులు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దేవుడే చూసుకుంటాడు
ఏపీలో దేవాలయాలపై దాడుల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 126 దేవాలయాల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని, ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం శోచనీయమని విశ్వహిందూ పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయాలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయించాల్సిన సీఎం, దేవుడే చూసుకుంటాడని మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఏపీలో దేవాలయాలపై దాడులు ఆగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విశాఖలో డిమాండ్ చేశారు.











