తెలంగాణలో ఐదేళ్ల క్రితం నమోదైన ఓటుకు నోటు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన జరూసెలం మత్తయ్యను ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో డైరెక్ట్‌గా మత్తయ్య నాకు సంబంధం లేదని గతంలోనూ న్యాయస్థానాల్లో విచారణలో భాగంగా వ్యాఖ్యానించడం, అప్రూవర్ గా మారడం తరువాత ఈడీ విచారణ జరగడంపై రాజకీయ వర్గాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి మనీలాండరింగ్ లాంటివి జరిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈ కేసులో ఆ అంశం ఎంతమేరకు ఉందనేది తేలాల్చి ఉంది. మరోవైపు కేంద్రం జోక్యం ఉండవచ్చుననే స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.
మీడియాకు అన్నీ లీకులే..
అసలు ఈడీ విచారణలో మత్తయ్య ఏం చెప్పాడనే సంగతి ఎవరికీ తెలియదు. ఈడీని ఎవరూ అడగరు.. మత్తయ్య ఎవరికీ చెప్పలేదు. మత్తయ్య ఈడీకి ఈ కేసులో కీలక సమాచారం ఇచ్చాడని, ఈ కేసులో మొత్తం సూత్రధారులు, పాత్రధారులు రేవంత్ రెడ్డి, చంద్రబాబేనని సమాచారం ఇచ్చాడని మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంతనేది తేలాల్సి ఉంది.
ఇక కేసులో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జరూసెలం మత్తయ్య పదిరోజుల క్రితం రేవంత్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో ఓ వర్గ కార్యక్రమాల నిర్వాహకుడిగా ఉన్న మత్తయ్య, స్టీఫెన్ సన్‌కు ఎమ్మెల్సీ ఇప్పించే విషయంలో సహాయం చేశారు. అయితే 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు స్టీఫెన్ సన్ తో రూ.5కోట్లకు ఒప్పదం జరిగిందని, అందులో రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చేందుకు రేవంత్ వచ్చారని, ఏసీబీకి పట్టుబడ్డారని ఆరోపణ. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది.
ఇక ఇటీవలే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చిన సమయంలోనే ఈ కేసు కూడా తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలకు, కేంద్రంలో ఉన్న బీజేపీకి మింగుడు పడడం లేదు. అదే సమయంలో తమకు ఎదురు తిరిగిన చంద్రబాబు పేరు కూడా ఈ కేసులో ఉంది. దీంతో ఈడీ ఎంటర్ అయ్యేంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వచ్చాయి.
మరి ఫోన్ ట్యాపింగ్ కేసు..
ఈ కేసుతో పాటే మరో కేసు కూడా అదే సమయంలో నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో ఆయన ల్యాండ్ లైన్ ఫోన్లను ఇక్కడి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ప్రధాన ఆరోపణ. ఏసీబీ కేసు కంటే ఫోన్‌ల ట్యాపింగ్ పెద్ద కేసు అని, రాజ్యాంగ మౌలిక అంశాలకు విఘాతం కలిగించడం, వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్రాలను హరించేదిగా ఉంటుందని అప్పట్లోనే చర్చ జరిగింది. ఓటుకు నోటు కేసు బయటకు తీస్తే.. తమ పీకకు ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టుకుంటుందన్న భయం టీఆర్ఎస్ ఫ్రభుత్వానికి ఉందని అప్పట్లో చర్చ నడిచింది. అప్పుడప్పుడు రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు ఈ కేసులు తెరపైకి వస్తున్నాయని చర్చ నడుస్తోంది.
ఉదయ్ సింహ అరెస్టు..
ఇదే కేసులో ఏ3గా ఉన్న ఉదయ్ సింహాను ఇటీవలే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే న్యాయస్థానానానికి హాజరు కాని కారణంగా ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఆయన్ను అరెస్టు చేశారు.











