ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. చిన్న హీరోలను పెట్టి పెద్ద హిట్లు సొంతం చేసుకున్న ఏకైక దర్శకుడు ఆయన. 1990 దశకంలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి అద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా కమెడియన్ అలీని హీరోగా తీసుకోని యమలీల వంటి చిత్రాన్ని తెరకెక్కించి చరిత్ర సృష్టించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు లైఫ్ ఇచ్చింది ఈ దర్శకుడే. హీరోగా ఉగాది, అభిషేకం సినిమాల్లో మెరిశారు.
తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయనే సంగీతం అందించేవారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన కొత్తతరం దర్శకులు రాకతో పూర్తిగా కనుమరుగైపోయారు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ అందించాలట. చిరంజీవి-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ తనకు వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో తాను మ్యూజిక్‌తో పాటు అన్ని విభాగాల్లో వర్క్ చేయడం వల్ల చిరంజీవి సినిమాకు పనిచేసే ఛాన్స్ కోల్పోయానని ఆయన వెల్లడించారు.
“చిరంజీవి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నన్ను కోరారు. కానీ ఆ సమయంలో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. అలా చిరంజీవి గారితో పనిచేసే ఛాన్స్ కోల్పోయా. అయితే ఆయన సినిమాకు పనిచేసే టాలెంట్ నాలో ఉందని గుర్తించిన రాఘవేంద్రరావు గారికి ఇప్పటికీ మనసులో థ్యాంక్స్ చెబుతూనే ఉంటా’ అని తెలిపారు. తాను వెండితెరకు దూరం కాలేదని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌గా ఓ కథ రాస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మరల మెగా ఫోన్ పడతానని ఆయన తెలిపారు. తనను ఇంతకాలం గుర్తుపెట్టుకున్న ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.











