(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా కుల దూషణ కేసులతో టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
మాజీ సర్పంచ్ పై కేసు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం మాజీ సర్పంచి మాదిన రామారావుపై ఆ గ్రామానికి చెందిన ఒక వాలంటీరు కులదూషణ కేసు పెట్టారు. దీంతో సర్పంచ్ కుటుంబ సభ్యులను శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రామారావు సర్పంచిగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరగడంతో ఓర్వలేని వైసీపీ నాయకులు కేసులు పెట్టి పోలీసులతో వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఏక పక్షంగా పోలీసులు
వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. మాజీ సర్పంచ్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కావాలనే కేసులు పెడుతున్నారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఇటువంటి సంఘటనలకు టీడీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Must Read ;- కొత్త జిల్లాలు అడిగితే.. అణచివేతలు తప్పవ్!











