రాజకీయ చైతన్యానికి, ప్రజాఉద్యమాలకు మారుపేరైన శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ సిగపట్లు జోరందుకున్నాయి. వైసీపీ తన ప్రాభవాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటే, టీడీపీ తన ఉనికిని నిరూపించుకునేందుకు సిద్ధపడుతోంది.
ధర్మాన బూతులతో రాద్ధాంతం
టీడీపీ, వైసీపీ మధ్య చాపకింద నీరులావున్న రాజకీయ వైరుధ్యాలు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, బహిరంగ సవాల్ రాద్ధాంతానికి దారితీసాయి. ధర్మానకు ధీటుగా టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు.
వేరొకవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు నేతృత్వంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు , ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ , టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్ తదితరులు నేరుగా నరసన్నపేట పోలీసు స్టేషన్లో ధర్మానపై ఫిర్యాదు చేశారు.
అక్కడతో ఆగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషనులలో ధర్మానపై ఫిర్యాదులు చేస్తున్నారు. వీరికి ధీటుగా ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు ప్రతివిమర్శలు చేస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది.
అగ్నిలో ఆజ్యం పోసిన ‘సీదిరి’
జిల్లాలో వైసీపీ , టీడీపీ మధ్య రాజకీయ రచ్చ జోరందుకుంటున్న సమయంలో జిల్లాకు చెందిన మరో మంత్రి సీదిరి అప్పలరాజు అగ్నిలో ఆజ్యం పోశారు. ‘విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తా, పోటీ చేసి నాపై గెలిచే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా, అసభ్యకరంగా మాట్లాడేది కూన, అచ్చెన్నలే’ అంటూ శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అచ్చెన్న , రామ్మోహన్ నాయుడు , కూన రవికుమార్ తదితర తెలుగుదేశం నాయకులందరినీ ఏకిపారేసారు. పనిలోపనిగా ‘మంచికి మరోపేరుగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ మాటలను వక్రీకరించి, ఎల్లో మీడియాలో బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరి కాదని’ మీడియాపై నిందేసేశారు.
అమరావతిలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే…
అమరావతి లో ఉన్నవారు రైతులు కాదు… పెయిడ్ ఆర్టిస్టులేనని, వారు చాలా పేదవారు కాబట్టి
అమరావతి రైతులు విమానం మీద ఢిల్లీ వెళ్తారని ఎద్దేవా చేసారు. వాళ్లు ముమ్మాటికీ ఫేక్ రైతులే…అని మంత్రి సీదిరి వ్యాఖ్యానించారు.
రాజీనామా చేస్తా .. పోటీ చేసి గెలవండి
‘నేను రాజీనామా చేస్తా, పలాసలో తనపై ఎవరైనా టీడీపీ నాయకులు పోటీ చేయండి. మీకు దమ్ముంటే తెదేపాను గెలిపించి విశాఖ రాజధాని ప్రజలు వద్దంటున్నారని నిరూపించండి’ అని మంత్రి సీదిరి టీడీపీ వర్గాలకు సవాల్ చేశారు. మంత్రి సీదిరి వ్యాఖ్యలపై అమరావతి రైతుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వేరొకవైపు జిల్లా అంతటా రచ్చ రచ్చ అవుతోంది.
ధర్మాన అన్న మాటలు కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి గనుక.. తెలుగుదేశం నాయకులు పోలీసుల కంప్లయింట్లు పెడుతూ.. కక్ష తీర్చుకుంటున్నారు. మరి సీదిరి అప్పలరాజు మాటలకు ఏ రీతిగా కౌంటర్ ఇస్తారో అర్థం కావడం లేదు.