(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
పలాస – విశాఖ రైలు ప్రారంభోత్సవం అధికార, ప్రతిపక్షాల మధ్య రాద్ధాంతం సృష్టిస్తోంది. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి రైలును జెండా వూపి మంత్రి అప్పలరాజు ప్రారంభించడంపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పలాసలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకి పారేశారు. పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో మోసాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
ఇది మోసం కాదా ..?
ప్రయాణికుల ఇబ్బంది దృష్ట్యా రైల్వే మంత్రికి రైళ్లు నడపాలని లేఖ రాస్తే భువనేశ్వర్, విశాఖకు ప్రత్యేక రైళ్లు వేశారని, కానీ ప్రొటోకాల్ పాటించకుండా జెండా ఊపి మంత్రి అప్పలరాజు వారి ఘనతేనని ప్రకటించుకోవటం మోసం చేయటం కాదా అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో మోసాలకు పాల్పడుతోందని విమర్శించారు. నవరత్నాల్లో భాగంగానే పింఛను పంపిణీ ప్రకటించారని గొప్పలు చెప్పుకొంటుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో అవ్వాతాతలకు రూ.3వేలు పింఛను ఇస్తామని ప్రకటించి ఇప్పుడు రూ.250 పెంచి మోసం చేశారన్నారు.
వైసీపీ ఇసుక వ్యాపారం
ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి నేడు వైసీపీ నాయకులే వ్యాపారం చేసుకునేలా ప్రణాళిక తయారు చేశారని ఎంపీ ఆరోపించారు. రాజధానిగా అమరావతి తయారవుతున్న సమయంలో ఒక్క మాట మాట్లాడని ముఖ్యమంత్రి జగన్, అధికారం రాగానే రాజధాని పేరుతో విశాఖలో పాగా వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పలాసలో అక్రమ కంకర వ్యాపారం వైసీపీ నాయకులే నడిపిస్తున్నారని ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన సైనికుడు మృతి చెందితే ప్రభుత్వం నుంచి పరిహారం రప్పించలేని దుస్థితిలో ఉన్న మంత్రులు ఈ ప్రాంతంలో ఉన్నారని ఎంపీ ఎద్దేవా చేశారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీపై చేసిన విమర్శలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వీటిపట్ల వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- కృషి ఒకరిది.. ఆర్భాటం వేరొకరది!