తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీడీపీ రూటు మార్చింది. గెలుపు కోసం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్‌తో కలగలిపిన విధానాన్ని ఎంచుకుంది. ఓ వైపు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి పదిసార్లు ప్రచారం చేసేలా చేయడంతోపాటు సోషల్ మీడియా ద్వారా సేవ్ తిరుపతి నినాదంతో పాటు ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ఓవైపు మౌలిక ప్రచార పద్దతులతో పాటు యువతను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో టీడీపీ కేడర్‌ని భయభ్రాంతులకు గురిచేసే చర్యలను తిప్పికొడుతూ..కార్యకర్తలకు అండగా ఉండేందుకు కూడా నిర్ణయించింది.
ఆర్భాటాలకు దూరంగా..
సాధారణ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే హడావుడి లేకుండా ప్రతి ఇంటింటికీ కాలినడకన వెళ్లి టీడీపీ ప్రచారం చేయనుంది. ప్రతి బూత్‌కి ఓ నాయకుడిని సమన్వయకర్తగా నియమించనుంది. టీడీపీకి ఆయువుపట్టుగా ఉండే బూత్ కమిటీల ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను కచ్చితంగా నమోదు చేయడం, పరిగణనలోకి తీసుకోవాలని సూచనలూ జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలను సమన్వయం చేసేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పది ప్రాదేశికాల(క్లస్టర్)ను ఏర్పాటు చేశారు.
ఓటర్లను ప్రభావితం చేసేలా బాధ్యతలు
ప్రతి క్లస్టర్‌లో ఐదు యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్‌లో ఐదు బూత్‌లు ఉండనున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందికి ఒక బూత్‌గా చెప్పవచ్చు. ఒక్కో క్లస్టర్‌కు ఎమ్మెల్యే, నియోజకవర్గ స్థాయి నాయకుడితో పాటు స్థానిక నాయకుడికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ప్రతిబూత్‌కి ఓ కన్వీనర్, మండల స్థాయి నాయకుడు సమన్వయం చేస్తారు. బూత్ కమిటీలో ఉండే సభ్యులు ప్రతి వందమంది ఓటర్లను ప్రభావితం చేసేలా బాధ్యతలు అప్పగించారు. సరాసరిగా పదిమంది బూత్ కమిటీ బాధ్యతలు తీసుకుంటారు. ఈ ప్రకారం చూస్తే..తిరుపతి లోక్‌సభ నియోజవకర్గ పరిధిలో మొత్తం 15 వేల నుంచి ఇరవై వేల మంది వరకూ ప్రచారం చేయనున్నారని చెప్పవచ్చు. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, క్షేత్ర స్థాయిలో వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, పథకాల పంపిణీలో వివక్ష తదితర అంశాలతోపాటు టీడీపీ హయాంలో జరగిన ప్రగతిని వివరించనున్నారు. పోలింగ్ ప్రచార సమయం ముగిసే నాటికి కనీసం పదిసార్లు ఇంటింటి ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.
స్మార్ట్ వర్క్..
ఇక తాడిపత్రిలో టీడీపీ అనుసరిచిన విధానం సక్సెస్ కావడంతో తిరుపతిలోనూ అదే విధానం అమలు చేస్తోంది. తాడిపత్రిలో సేవ్ తాడిపత్రి నినాదం సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో తిరుపతిలోనూ సేవ్ తిరుపతి నినాదాన్ని తెరపైకి తెచ్చింది. తాడిపత్రిలో వైసీపీ గెలిస్తే తాడిపత్రి నాశనం అవుతుందనే విధంగా వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ పలు ఆరోపణలు చేసింది. తిరుపతిలోనూ అదే తరహాలో ప్రచారం చేస్తోంది. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, మతపరమైన అంశాల్లో వైసీపీ అనుసరిస్తున్న విధానం, వైసీపీ ఎన్నికల ముందు ఏం చెప్పింది..అధికారంలోకి వచ్చాక ఏం చేస్తోంది, ఇలా అన్ని అంశాలను సేవ్ తిరుపతి లో భాగంగా ప్రచారం చేయనుంది. ఇక టీటీడీ విషయాల్లో ప్రభుత్వ జోక్యం, అన్యమత ప్రచారం, పింక్ డైమండ్ విషయంలో గతంలో వైసీపీ విష ప్రచారం, తాజాగా మళ్లీ రమణ ధీక్షితులతోపాటు మరికొందరిని అర్చకులుగా నియమిస్తూ నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా పస్తావిస్తోంది. ఇందుకోసం savetirupati.com సైట్‌ను కూడా ప్రారంభించింది. వీటితోపాటు తిరుపతిలో కొందరు వైసీపీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని కూడా ప్రచారం చేయనుంది.
Also Read:తిరుపతి అభ్యర్థుల్లో ఆమె చాలా రిచ్ : ఎవరి ఆస్తులు ఎంతంటే..?