పురపాలక ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ స్థానాలు వచ్చిన కడపజిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాల్టీల్లోనూ వైసీపీ పాగా వేసేందుకు పవర్ పాలిటిక్స్‌కు తెరలేపినట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మైదుకూరు, తాడిపత్రి మున్సిపాల్టీలపై చర్చ నడుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలోని మైదుకూరులో టీడీపీ గెలవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేపిందన్న విమర్శలు మొదలయ్యాయి.
మైదుకూరులో..
కడప జిల్లా మైదుకూరులో మొత్తం 24 స్థానాలున్నాయి. ఇక్కడ టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 కైవసం చేసుకున్నాయి. ఇక్కడ ఇద్దరు (ఎమ్మెల్యే, ఎంపీ) ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 26స్థానాలు అవుతాయి. అందులో 14సీట్లు వచ్చినవారికి ఛైర్మన్ పీఠం దక్కుతుంది. దీంతో మైదుకూరులో క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారింది. వైసీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్ రెడ్డి ఇక్కడే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. దీంతో వైసీపీ బలం 13కి పెరిగింది. ఛైర్మన్ పీఠం దక్కాలంటే ఇంకా ఒక్క ఓటు అవసరం అవుతుంది. అయితే జనసేన నుంచి గెలుపొందిన వ్యక్తి వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో టీడీపీ నుంచి గెలిచిన వారిని వైసీపీ టార్గెట్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.
6వ వార్డులో గెలుపొందిన టీడీపీకి చెందిన మహబూబ్ అనే మహిళను పోలీసులు దౌర్జన్యంగా వాహనంలో ఎక్కించుకెళ్లి వైసీపీ క్యాంప్‌కి తరలించారని ఆందోళన చేపట్టారు. టీటీడీ మాజీ ఛైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి వస్తున్న ఆమెను పోలీసులు వాహనంలో ఎక్కించుకెళ్లారని టీడీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరు తమకు మద్దతు తెలుపుతారని, టీడీపీ ఛైర్మన్ అభ్యర్థికి అనుకూలంగా వారు ఓటు వేస్తారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో మైదుకూరు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
Must Read ;- తాడిపత్రిలో ఆ నలుగురి ఎమ్మెల్సీలకు నో ఛాన్స్..
తాడిపత్రిలోనూ..
ఇక తాడిపత్రిలోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నా..టీడీపీ తన పట్టును కొనసాగిస్తోంది. తాడిపత్రిలో మొత్తం 36వార్డులకు గాను 18చోట్ల టీడీపీ గెలిచింది. వైసీపీ 16స్థానాలు గెలిచింది. సీపీఐ ఒకటి దక్కించుకుంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వీరు కాకుండా నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే, ఎంపీలు ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని భావించారు. అయితే ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, శమంతకమణి, మహమ్మద్ ఇక్బాల్‌ల దరఖాస్తును తిరస్కరిస్తూ మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ షాక్ ఇచ్చారు. నిబంధనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎక్కడైతే ఓటు హక్కు నమోదు చేసుకున్నారో అక్కడే ఓటు వేసేందుకు అర్హులని పేర్కొన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీకు ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైసీపీ ఎంపీ రంగయ్యకు మాత్రమే ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉంది. ఈ ప్రకారం చూస్తే ఛైర్మన్ పదవి దక్కాలంటే 20 ఓట్లు అవసరం అవుతాయి. ఇప్పటికే టీడీపీ గెలిచిన 18స్థానాలతోపాటు టీడీపీకి మద్దతు ప్రకటించిన సీపీఐ, స్వతంత్ర అభ్యర్థిలతో కలిపితే టీడీపీకి అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపినా.. మొత్తం బలం 18కి చేరుతుంది. ఛైర్మన్ స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకోవాలంటే మరో రెండు ఓట్లు అవసరం అవుతాయి. అయితే ఇక్కడ వైసీపీ పవర్ పాలిటిక్స్ వ్యూహం అమలు చేస్తుందన్న టెన్షన్ టీడీపీలో మొదలైంది. దీంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తమ పార్టీ నుంచి గెలుపొందిన వారిని, మద్దతు ఇస్తున్న వారిని వేరే ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎలాగైనా 2ఓట్లు తమవైపు వస్తాయని, ఛైర్మన్ సీటు తమకే దక్కుతుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద టీడీపీ ఎక్కువస్థానాలు గెలిచిన చోట్ల కూడా వైసీపీ పవర్ పాలిటిక్స్ చేస్తోందన్న విమర్శలు తలెత్తాయి.
Also Read ;- రహస్య ప్రదేశానికి తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్లు