తమిళనాడులో ఎన్నికల సందర్భంగా పార్టీలు, నాయకులు ఇస్తున్న హామీలపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు వచ్చాయంటే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పథకాల రూపకల్పన కంటే.. ఉచిత పథకాలపై దేశంలోని పార్టీలన్నీ దృష్టి సారిస్తున్న వేళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఉచిత పథకాల ద్వారా కొందరు పౌరుల్లో సోమరితనం పెరుగుతోందనే కోణంలో న్యాయస్థానం ఆక్షేపించింది.
అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ..
అయితే కేవలం తమిళనాడుకే ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా..అక్కడి పార్టీలు మాత్రమే ఉచిత వాగ్దానాలు చేస్తున్నాయనే అనే విషయానికి వస్తే..దేశంలోని పార్టీల్లో 90 శాతం పార్టీలు అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ, స్వీయ ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటి విస్తృత ప్రయోజన విధానాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేయడం జరుగుతోంది. తమతమ ఇబ్బందుల నేపథ్యంలో ఓటర్లు కూడా అటువైపు ఆకర్షితులు కావడం, అధికారాన్ని కట్టబెడుతుండడంతో పార్టీలకు కూడా తప్పని సరిగా మారిందా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోపాటు భావి తరాలకు కనీస వసతుల కల్పన కూడా కష్టం అవుతుందని చెప్పవచ్చు. ఇందుకు వెనిజులా దేశాన్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో కొన్ని వ్యవస్థలు వెనిజులాతో పోల్చితే మెరుగ్గానే ఉన్నాయి. అయితే స్వతంత్ర వ్యవస్థల్లోనూ పాలకుల జోక్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో వెనిజులా అనుభవం ప్రస్తావించాల్సిన అంశమే.
సంపన్న నిక్షేపాలు..ఆకలి చావులు..
వెనిజులా 1920-1970 మధ్య కాలంలో ప్రపంచంలోనే చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న దేశం.. అయితే ఇప్పుడు కప్పు కాఫీ ధర అక్కడ దాదాపు పది లక్షల బొలివర్లు. గత పదేళ్లలో ధరలు 155000 శాతం పెరిగాయి. నెలలో ఒకసారి మాంసం కొనాలంటే నెల జీతంలో 3వ వంతు ఖర్చు పెట్టాల్సిందే. రోజుకు 10సార్లు కరెంటు పోతుంది. ప్రతినెలా ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఆర్థిక వనరులు లేని దేశంలో ఈ పరిస్థితి వచ్చిందా అంటే..అదీ కాదు.. సంపన్న దేశంగా ఉండాల్సిన వెనిజులా.. ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరింది. 1 మిలియన్ బొలివర్స్ మన దేశ కరెన్సీలో దాదాపు రూ.39తో సమానం. అస్తవ్యస్త ఆర్థిక విధానాలే ఇందుకు దారి తీశాయి. చమురు విక్రయించిన ప్రభుత్వాలు అనుసరించిన అస్తవ్యస్త విధానాలు, ఉచిత పంపిణీ కార్యక్రమాలు, ప్రభుత్వం ద్వారా నిధులు పొదుపు చేసే వ్యవస్థ నిర్వీర్యం కావడం,అన్నీ ఉచితంగా రావడంతో ఉపాధి మార్గాలను పట్టించుకోకపోవడం, సంపద సృష్టి కొరవడం, బ్రెజిల్ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు ఆర్థిక నైపుణ్యం గల వ్యక్తులు సూచనలు పట్టించుకోలేదు. చమురు వెలికి తీసినందుకు భారీగా పన్నులు వసూలు చేసినా.. అవి అవినీతి పరుల చేతిలోకి వెళ్లాయి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక ప్రపంచంలో వెనిజులా దేశానికి చెందిన వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలూ చాలా తక్కువ. ఎందుకంటే నైపుణ్యం, అంకిత భావం లేకపోవడం ప్రధాన కారణం. అంటే ప్రభుత్వాలు దేశ ప్రజలను ఆ పరిస్థితిలోకి నెట్టాయి. వీటన్నిటికీ ప్రధాన కారణాలు రెండే రెండు. స్వీయ నియంత్ర లేకుండా చేసిన ఉచిత హామీలు, పంపిణీలు ఒకటైతే సంపద సృష్టి దిశగా పారిశ్రామిక, ఆర్థిక, ఉపాధి రంగాలను ప్రభుత్వాలు మెరుగుపర్చకపోవడం రెండో కారణం.

హామీలు తారస్థాయికి..
తమిళనాడులోని అంథియుర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న షేక్ దావూద్, సౌత్ మధురైలో పోటీ చేస్తున్న శరవణన్‌లు ఇచ్చిన హామీలూ రాజకీయపార్టీల వైఖరిని ప్రశ్నించేలా ఉన్నాయి. వీరిచ్చిన హామీలను చూస్తే.. ప్రతి ఇంటికీ రూ. పదిలక్షల రుణమాఫీ, ప్రతి రోజూ ఇంటికి లీటర్ మద్యం, బీర్, నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్‌ల వారీగా చంద్రమండలానికి తరలించడం, స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు, ఇంటిపనిలో మహిళలకు సాయంగా ఉండేలా ఉచిత రోబోల పంపిణీ, మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్డు పక్కన కాల్వ తవ్వించి ఇంటికి ఒక బోటు ఫ్రీ, ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని బయటపడేలా చేయడం కోసం 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండ నిర్మాణం, భూమి సేకరించి సాయంత్రం వేళ సేద తీరేందుకు కృత్రిమ సముద్ర బీచ్ సృష్టి, ఇంటికో ఐ ఫోన్ ఫ్రీ..ఇలా చాలా ఉన్నాయి. అయితే రాజకీయపార్టీలు ఇస్తున్న విచ్చలవిడి ఉచిత హామీలపై ప్రజలు ఆలోచించేందుకు ఈ హామీలు ఇచ్చినట్టు స్వతంత్ర శరవణన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో వాషింగ్ మెషిన్లు, ఫోన్లు ఇలా పలు పార్టీలు వస్తువులు ఫ్రీ అని ప్రకటించిన నేపథ్యంలో శరవణన్ ఈ హామీలు ఇచ్చారు.
దేశంలోని పార్టీలన్నీ జపిస్తున్న ఫ్రీ మంత్రం
తమిళనాడు మాత్రమే కాదు.. దేశంలోని పార్టీలన్నీ ఫ్రీ మంత్రాన్ని జపిస్తున్న నేపథ్యంలో మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన పై రాజకీయ పార్టీల దృష్టి పెట్టాలని సూచించడంతోపాటు ఉచిత పథకాల వల్ల ఏ పని చేయకపోయినా, ఎలాగైనా బ్రతికేయచ్చనే ఆలోచన ప్రమాదకరమైందని కోర్టు అభిప్రాయపడింది.ఇక అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కూడా. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక్కో అభ్యర్థి రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని, వారు ఇచ్చిన తాయిలాలు తీసుకుని ఓటు వేసినప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా అని హైకోర్టు వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశంలోని అన్ని పార్టీలను ఆలోచింపజేయడంతోపాటు ఉచిత హామీలను ఆశిస్తున్న వారి ఆలోచనల్లోనూ మార్పు వస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యమనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో నిజమైన అర్హులకు, ఉచితమైన, లేదా ఉపశమన చర్యలు, చేయూత నిచ్చే విధంగా నిధుల కేటాయింపును ఎవరూ తప్పుబట్టరు. అదే సమయంలో ఆ చర్యలతోపాటు సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక విధానాల రూపకల్పన కూడా జరగాలి. అలా కాకుండా ఆల్ ఫ్రీ మంత్రం జపిస్తే..రానున్నకాలంలో అప్పుల ఊబిలో మరింత కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలు అధికారాన్ని అనుభవిస్తాయి..అదే సమయంలో ప్రభుత్వాలు చేసిన అప్పులు..ప్రజలు భరించాల్సి ఉంటుందనే అవగాహన కూడా కల్పించినప్పుడే విచ్ఛలవిడి ఫ్రీ పథకాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పవచ్చు.
Also Read:తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు!











