Story of Jaya Prada
జయప్రదంగా సినీ జీవితాన్ని ముగించండం అందరి వల్లా కాదు.. ఇక్కడ రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదు. అందానికి అభినయం తోడైతేనే నట ప్రయాణం జయప్రదంగా సాగుతుంది. అది జయప్రద విషయంలోనూ సాధ్యమైంది. తెలుగు సినిమా కథానాయికల శకంలో కొన్ని ప్రత్యేకమైన పేజీలున్న నటీమణుల్లో జయప్రద కూడా ఉంటారనడం అతిశయోక్తి కాదు. భానుమతి, అంజలీదేవి మొదలుకుని సావిత్రి, జమునల శకం ముగిశాక జయసుధ, శ్రీదేవి, జయప్రద శకం కూడా ఆ స్థాయిలోనే చెప్పుకోవలసి ఉంటుంది.
సినిమా రంగంలో హీరోయిన్ల మనుగడ సాధారణంగా కొద్ది కాలమే ఉంటుంది. ఎక్కువ కాలం సినిమా రంగంలో కొనసాగిన నటీమణుల్ని చెప్పుకోవాలంటే మనం పైన పేర్కొన్న వారినే చెప్పాలి. ఆ తర్వాత అలా సౌందర్య వచ్చినా ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడు జయప్రద విషయంలోకి వద్దాం. అటు నటనా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించిన వ్యక్తిగా జయప్రద గురించి చెప్పాలి. రాజకీయాల్లో ఆమె బిజీ అయ్యాక నటనకు స్వస్తి చెప్పారు. ఎప్పుడోగాని తెరపై కనిపించలేదు. మళ్లీ ఆమె చూపు ఇప్పుడు నటన వైపు మళ్లింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Story of Jaya Prada :
వయసు కాదు మనసు చూడాలి
మనసు చూడాలిగానీ వయసు చూడకూడదు. అసలు ఇంతకీ జయప్రద వయసు ఎంత? మగవాడి జీతం, ఆడవారి వయసు అడగకూడదని అంటారు. ఎవరినీ అడగకపోయినా వికీని చూస్తే ఆమె వయసెంతో అదే చెప్పేస్తుంది. 1962లో ఆమె పుట్టిందంటే ఆమె షష్టపూర్తిలోకి అడుగుపెట్టినట్టే కదా. అయినా తారలు ఎందరోగాని అరవై ఉన్నా నలభైలోనే ఉన్నట్టు కనిపిస్తుంటారు. మరీ ఇరవై అనడం బాగోదు కదా. ఆమె అందాన్ని వర్ణిస్తూ సత్యజిత్ రే ‘ఒన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్ ద వరల్డ్’ అన్నారు. అంతగా ఆమె ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. ఆమెను ఊహించుకుని కథలు రాసిన రచయితలూ ఉన్నారు. సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధతో పోటీపడి జయప్రద నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
మచ్చుకు మేఘసందేశం, శ్రీవారిముచ్చట్లు చాలు. ఆమె సినిమా జీవితం కూడా అంతులేని కథే. ఆరోజుల్లో అరవైలోని హీరోలతో చెంగు చెంగున జయప్రద ఎగిరితే అభిమానులు ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరు తారలకు గుడి కట్టిన అభిమానులు చాలా మందే ఉన్నారు. జయప్రదకు మాత్రం గుండెల్లోనే గుడి కట్టారు. అగ్రహీరోలందరితోనూ ఆమె జత కట్టారు. ముఖ్యంగా నటరత్న నందమూరి తారకరామారావుతో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
రాజకీయ అడుగులు
తెలుగులో మొదలైన ఆమె పయనం బాలీవుడ్ దాకా సాగింది. అక్కడి నుంచి ఆమె జీవితం రాజకీయాల వైపు మళ్లింది. మొదట్లో తెలుగు దేశం పార్టీలో చేరి సేవలందించారు. సమాజ్ వాది పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోనూ పనిచేశారు. జయప్రద తర్వాత ఆ స్థాయిలో రాజకీయ జీవితాన్ని అనుభవించిన నటిగా జయప్రదను కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడామె భాజపాలో ఉన్నారు. రేపు మరే పార్టీలో ఉంటారో తెలియదుగానీ మళ్లీ ఆమె చూపు నటన వైపు పడిందని చెప్పక తప్పదు.
నటుడు రాజేంద్ర ప్రసాద్ తో ఆమె ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె స్టిల్ కూడా వైరల్ అవుతోంది. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఓ హిట్ వస్తే జయప్రద జీవితం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుందని మాత్రం చెప్పకతప్పదు.
Also Read:తమిళనాట రాజకీయంలో ‘రజనీ’కాంతుల మాటేమిటి?