ప్రభుత్వం హెచ్చరికలను ఎవరు ఖాతరు చేస్తున్నారు?… జారీ చేసే జీవోలను ఎవరు పట్టించుకుంటున్నారో విశాఖలోని టింపని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే … కావలసిన సమాధానం దొరుకుతుంది.
సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా డోంట్ కేర్…
విశాఖలోని పేరున్న స్కూళ్లలో మొదటి స్థానంలో నిలిచేది టింపని స్కూల్. ఈ స్కూల్ యాజమాన్యానికి .. తల్లిదండ్రులకు ప్రతి ఏటా ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో… ఈ స్కూల్ యాజమాన్యం మొత్తం ఫీజులు చెల్లించాల్సిందే నంటూ పట్టుబడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు, జీవోలు జారీ చేసినప్పటికీ తమకు సంబంధం లేదన్నట్లు ఈ యాజమాన్యం వ్యవహరిస్తోంది.
అందులో భాగంగానే మొత్తం ఫీజు చెల్లించాలని డిమాండ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత మార్చి నుంచి దఫదఫాలుగా ఫీజుల విషయంలో యాజమాన్యంతో పేరెంట్స్ కమిటీ చర్చలు జరుపుతూనే ఉంది. ఎన్ని చెప్పినా మొత్తం ఫీజు చెల్లించాల్సిందే అని స్పష్టం చేయడంతో.. జిల్లా కలెక్టర్ కు, విద్యాశాఖ అధికారి కి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఈవో స్కూల్ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. కానీ స్కూల్ యాజమాన్యం వాటిని పట్టించుకోలేదు.
దీంతో పేరెంట్స్.. స్పందనలోనూ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పలువురు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం తగ్గకపోవడంతో.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తనకు వదిలేయండి అని.. తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం మొండి పట్టువీడలేదు. ఈ క్రమంలోనే స్కూల్ యాజమాన్యంతో సోమవారం వాగ్వాదం పెరగడం కొందరు స్టూడెంట్ యూనియన్ నాయకులు, పేరెంట్స్ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయడం చకచకా జరిగిపోయాయి.
తమ సమస్యను పరిష్కరిస్తే గాని కిందకు దిగే ప్రసక్తే లేదని చెప్పడంతో.. డీఈవో, ఎమ్మార్వో, ప్రజాప్రతినిధులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పేరెంట్స్ తో చర్చించారు. విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ కూడా పేరెంట్స్ కమిటీ తో మాట్లాడి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఎవరి అండ ఉందో?
ఇటు జిల్లా యంత్రాంగం గాని, అటు విద్యాశాఖ అధికారులు గాని, మంత్రులు, ప్రజాప్రతినిధులు గాని స్కూల్ యాజమాన్యం పై ఒత్తిడి తె స్తున్నా లొంగక పోవడం వెనుక అసలు కారణం ఏంటన్నది అంతుచిక్కడం లేదు. యాజమాన్యానికి అండగా ఎవరు కాపు కాస్తున్నారు? అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది? కొన్ని వేలమంది తల్లిదండ్రులతో ఆడుకుంటున్న టింపని స్కూల్ పై చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తే గాని ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు.











