ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.. ఇదంతా జరిగే పనేనా అనుకోకండి.. త్వరలో ఏపీ బస్సుల్లో ఏసీ రాబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఏసీ సర్వీసులుగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే వెయ్యి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో మరో రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి వస్తాయి. వీటి కోసం వెయ్యికిపైగా ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో 99 శాతం డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. వీటి స్థానంలో దశలవారీగా విద్యుత్ సర్వీసులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని ప్రోత్సహిస్తోంది. మన దేశానికి అవరమైన 80 శాతం పెట్రోలియం, 60 శాతం గ్యాస్ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. దీని కారణంగా విపరీతమైన ఆర్ధిక భారం పడుతోంది. అంతేకాక పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధంతో క్రూడాయిల్ రేట్లు పెరిగితే.. గ్యాస్ దొరకడం లేదు.
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు కూడా సోలార్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని భారీగా పెంచుతోంది. రెన్యువబుల్ ఎనర్జీ వినియోగం పెంచే లక్ష్యంలో భాగంగా.. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
కొత్తగా తీసుకొనే అన్ని విద్యుత్ బస్సుల్లో ఏసీ తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం గరుడ, వెన్నెల వంటి ప్రీమియం సర్వీసుల్లో మాత్రమే ఎయిర్ కండిషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇకపై కొత్తగా వచ్చే అన్ని బస్సుల్లో.. అంటే పల్లె వెలుగు, సిటీ సర్వీసులతో సహా అన్ని ఏసీ ఫెసిలిటీతో వస్తాయి. అంటే.. ఏపీలో ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లగా కూల్ కూల్‌గా సాగిపోతుందన్న మాట.











