దీపావళి టపాకాయల పేలుళ్లపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని చూపించింది. టపాసుల నియంత్రణకు జీవో తెచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని, అది కూడా పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్లు మాత్రమే వినియోగించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే కొవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి విషయంలో.. టపాసుల వలన వచ్చే పొగ చాలా ప్రమాదకరంగా మారుతుంది గనుక.. పేలుళ్లు తగదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాల మధ్య పదడుగుల దూరం ఉండేలా, కొనుగోలు దారుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కూడా అందులో చెప్పేశారు.
ఆ పాయింటు దగ్గరే అసలు విషయం ఉంది. ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యే చూడావలసిన వారికి.. అది వినిపించిందా లేదా అనేది ప్రశ్న. ఈపాటికి అధికారులు రంగంలోకి దిగాలి. దీపావళి క్రాకర్లు అనేది కేవలం వేడుకకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ప్రత్యేకింది ఈ ఏడాది.. కేవలం పేలుళ్లకు, ప్రమాదాలకు సంబంధించిన భయం మాత్రమే కాదు. కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో యావత్ సమాజానికి చేటు చేయగల ప్రమాదం కూడా పుష్కలంగానే ఉంది. అలాంటప్పుడు ప్రజలు గ్రీన్ క్రాకర్లు మాత్రమే వాడాలని చెప్పేసి ఊరుకుంటే సరిపోదు.
దుకాణాల తనిఖీలు అత్యవసరం
ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోకుండా యథోరీతిగా వ్యాపారాలు చేసేసుకుంటూ ఉంటారు. లోకల్ అధికారుల్ని కాస్త మేనేజ్ చేస్తే.. విక్రయాలు అయిపోయే దాకా ఇబ్బంది ఉండదనేది దుకాణదారుల ఆలోచనలుగా ఉంటుంది. మహా అయితే కాస్త జరిమానాలు వేస్తారు గానీ.. ఆలోగా బిజినెస్ పూర్తి చేసుకోవచ్చునని అనుకుంటూ ఉంటారు.
అసలు గ్రీన్ క్రాకర్లు మినహా మరేవీ ప్రజలు కాల్చకూడదని ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో భావిస్తే గనుక.. కాస్త గట్టి చర్యలు తీసుకోవాలి. గ్రీన్ క్రాకర్లు మినహా మరొకటి విక్రయించకుండా.. దుకాణాలపై చర్యలుండాలి. తక్షణం రాష్ట్రమంతా అధికారులు రంగంలోకి దిగాలి. గ్రీన్ క్రాకర్లు కాకుండా ఇతర క్రాకర్లు ఉన్నట్లయితే తక్షణం వాటిని సీజ్ చేయాలి. దుకాణాలను కూడా మూయించాలి. అతిగా అలాంటి ప్రమాదకర క్రాకర్ల వ్యాపారం చేసేవారు దొరికితే.. దీపావళి పూర్తయిన వారం రోజుల దాకా తిరిగి తెరవకుండా మూయించాలి. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే.. కొంత వరకైనా నియంత్రణ సాధ్యమవుతుంది.
అలా కాకుండా.. ప్రజలు గ్రీన్ క్రాకర్లు కాల్చాలి అని ఒక మాట చెప్పేసి.. అక్కడితే మన బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వం భావిస్తే కుదరదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీపావళి బెడద సమాజానికి చేటు చేయకూడదనే ఒక సదుద్దేశంతో ఉత్తర్వులు తెచ్చినప్పుడు, అధికార యంత్రాంగం మొత్తం బాధ్యతగా, చురుగ్గా వ్యవహరిస్తే మాత్రమే.. ఆ ఉత్తర్వులకు అర్థం ఉంటుంది. ప్రజలు సురక్షితంగా ఉంటారు.