(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. ఈ సీజన్ లోనే రూ.600 కోట్లు చేతులు మారాయని అంచనా. పోలీసులు అడపాదడపా కొన్ని ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నా, బెట్టింగ్ మాఫియాను మాత్రం నిలువరించలేకపోతున్నారు. దీంతో బెట్టింగ్ పిచ్చిలో పడి ముఖ్యంగా యువత లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. అటు బెట్టింగ్ ముఠాల బెదిరింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామానికి చెందిన ఊర సురేష్, ఊర కొమరయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో సురేష్ చనిపోయారు. కొమరయ్య గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
బెట్టింగ్ ముఠాలకు అండగా అధికారపార్టీ నేతలున్నారా?
ఏపీలో ముఖ్యంగా నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి కేంద్రాలుగా క్రికెట్ బెట్టింగ్ దందా కొనసాగుతోంది. కొందరు అధికారపార్టీ నేతల అండ చూసుకుని బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొన్ని ముఠాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు కూడా సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని ముఠాలు క్రికెట్ బెట్టింగ్ ను దర్జాగా కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్ ద్వారా వచ్చే కమిషన్లలో కొంతమేర అండదండలు అందించిన వారికి కూడా ముడుతున్నాయని తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం గుట్టుగా సాగుతున్నా, దీనికి మాత్రం యువకులు బలైపోతున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
క్రికెట్ బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేతిలో డబ్బు లేకపోయినా, గెలుస్తామన్న అతి నమ్మకంతో లక్షలాది రూపాయలు బెట్టింగ్ పెడుతున్నారు. తీరా ఓడిపోవడంతో ముఠాలకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా పోలీసులు మాత్రం పెద్దగా దృష్టి సారించడం లేదు. పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకుంటే క్రికెట్ బెట్టింగ్ ముఠాలను పట్టుకోవడం అసాధ్యమైన పనేంకాదు. ఎందుకంటే అనేక మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు ప్రతిరోజూ బెట్టింగ్ ముఠాలను సంప్రదిస్తూనే ఉంటారు.
పోలీసులు నిఘా పెడితే చాలా ముఠాలను అదుపులోకి తీసుకోవచ్చు. కానీ క్రికెట్ బెట్టింగ్ నియంత్రణపై అటు ప్రభుత్వం గానీ, పోలీసు వ్యవస్థగానీ గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరికి ముట్టాల్సిన కమిషన్ వారికి అందుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అంతా తెలిసినా, ఏమీ తెలియనట్టు పోలీసులు నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పేకాట, క్రికెట్ బెట్టింగ్ ముఠాల హల్ చల్
ఏపీలో అధికార పార్టీ నేతల అనుచరులే పేకాట స్థావరాలను నడపటం, బెట్టింగ్ ముఠాలకు అండగా నిలవడం చేస్తున్నారని పలు ఉదంతాలు రుజువు చేశాయి. ప్రభుత్వం ఆన్ లైన్ పేకాట, డ్రగ్స్, గంజాయి, పేకాటను నియంత్రించేందుకు ప్రత్యేక శాఖ సెబ్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో క్రికెట్ బెట్టింగ్ ను మాత్రం చేర్చలేదు. సెబ్ ఉద్యోగులు కేవలం నాటుసారా బట్టీల ధ్వంసం, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకోవడానికే పరిమితం అవుతున్నారు. సిబ్బంది కూడా పెద్దగా లేకపోవడంతో సెబ్ అధికారులు అక్రమ దందాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సెబ్ ను బలోపేతం చేసి జూదాలపై ఉక్కుపాదం మోపితే ఎంతో మంది ప్రాణాలకు కాపాడినవారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.