వైసీపీకి వరుస షాకులు తగలనున్నాయా! అవును, ఇదే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. గతంలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి, ఆర్.కృష్ణయ్య ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే అనూహ్యంగా రాజీనామా చేసి విజయసాయి రెడ్డి బిగ్‌షాక్ ఇచ్చారు. మరో మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే విజయసాయి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఐతే మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా విజయసాయిరెడ్డి బాటలోనే ఉన్నారని తెలుస్తోంది.
త్వరలో రాజీనామా చేయబోయే నేతల్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన రాజ్యసభ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. విదేశాల నుంచి రాగానే రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి మరో ఏడాదికిపైగా పదవీకాలం ఉంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఐతే కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, మోపిదేవి, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. తాజాగా విజయసాయి రాజీనామాతో ఏడుకు చేరింది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ తరపున అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్, మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పరిమళ్ నత్వాని సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభలో వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణి ఎంపీలుగా ఉన్నారు. వీరు కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరు కూడా పదవులకు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడమా లేదా రాజకీయాలకు దూరంగా ఉండడమా అనే నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.











