ఈ ప్రపంచంలో తొలి కరోనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చి పది నెలలు దాటింది. చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసెంబర్‌లో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత కొద్ది నెలలకే ప్రపంచం మొత్తాన్ని దావానలంలా చుట్టుముట్టేసింది. ప్రపంచం మొత్తం మీద ఇప్పటివరకు 3 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. 3.2 లక్షల మంది మృత్యవాత పడ్డారు. భారత్‌లో 50 లక్షలకు పైగా కేసులు, 83 వేలకు చేరువలో మృత్యువులు నమోదయ్యాయి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ మీదే దృష్టి సారించారు.
ఈ ఏడాదిలోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందనుకోవడం అత్యాశేనని తేలిపోయింది. వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న దిగ్గజ ఫార్మా సంస్థ `ఆస్ట్రాజెనికా` వచ్చే ఏడాది ఆరంభంలో తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 176 వ్యాక్సిన్లు తయారీలో వివిధ దశల్లో ఉన్నాయి. 35 క్లినికల్ ట్రయల్స్ వరకు వచ్చాయి. వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మూడోదశ చేరువకు వచ్చిన వ్యాక్సిన్‌లు మొత్తం 9. వాటి వివరాలు చూద్దాం..
ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనికా
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆస్ట్రాజెనికా టీకా మీదే ఆశలు పెంచుకున్నారు. మూడో దశ ప్రయోగాలు కూడా ఇటీవలె ప్రారంభమయ్యాయి. 30 వేల మంది వాలంటీర్లను రిక్రూట్ చేసుకున్నారు. అయితే అమెరికాలో ఒక వలంటీరు మెదడులోని మైలీన్ తొడుగుకి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలింది. దాంతో సెప్టెంబర్ 6న ట్రయల్స్‌ను ఆపేశారు. యూకే, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు విరామం ఇచ్చారు. ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్ కూడా క్లినికల్ ట్రయల్స్‌కు విరామం ఇచ్చింది. త్వరలోనే తిరిగి ప్రయోగాలు ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది.
బయో ఎన్‌టెక్- ఫైజర్
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థతో కలిసి ఓ శక్తివంతమైన వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. అమెరికా ప్రభుత్వం అండగా నిలుస్తున్న మూడు వ్యాక్సిన్‌లలో ఇది ఒకటి. ఇప్పటికే ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వం 100 మిలియన్ డోస్‌లు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ ప్రకటించారు.
కాన్సినో బయోలాజిక్స్- బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రపంచంలో మొట్ట మొదట క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన కంపెనీ కాన్సినో బయోలాజిక్స్. మార్చిలో ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. `ఏడీ5`గా పిలిచే `అడినోవైరస్` నమూనాతో ఈ వ్యాక్సిన్ రూపొందుతోంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. మొదటి రెండు ట్రయల్స్ డేటా ఆధారంగా ఇది శక్తివంతమైన వ్యాక్సిన్ అని, వైరస్ ఎన్ని విధాలుగా పరివర్తనం చెందినా ఇది సమర్థంగా పనిచేస్తుందని కాన్సినో బయోలాజిక్స్ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
రష్యా స్ఫుత్నిక్-వి
గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న `స్పుత్నిక్-వి` వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. అయితే మూడో దశ పరీక్షలు పూర్తి కాకుండానే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేశారు. దీంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పరిశోధకులపై విమర్శలు చేశారు. ఈ వ్యాక్సిన్ యాంటీ బాడీలను తయారుచేస్తోంది కానీ చాలా తక్కువ మంది మీదే పరీక్షించడంతో నమ్మకంగా ఏమీ చెప్పలేమని `ద లాన్సెట్` మెడికల్ జర్నల్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తయారీకి మూడు భారతీయ కంపెనీలు సహకరిస్తున్నాయి.
జాన్సన్ అండ్ జాన్సన్
జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జన్‌సెన్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇంకా మూడో దశ ప్రయోగాలకు చేరుకోలేదు. ఈ నెల చివర్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని సంస్థ ప్రకటించింది. బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో ఇది ఒకటి. అమెరికా ప్రభుత్వం కూడా ఈ సంస్థకు వంద మిలియన్ డోస్‌లు ఆర్డర్ ఇచ్చింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల డోస్‌లు పంపిణీ చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
సినోవాక్
చైనాకు చెందిన ఫార్మా సంస్థ సినోవాక్ అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు జులై 16న ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఈ ఏడాది జనవరి 28నే సినోవాక్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది.
వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజిక్స్-సినోఫామ్
చైనా దిగ్గజ ఫార్మా సంస్థ `సినోఫామ్`.. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మూడో దశ ప్రయోగాలకు అనుమతి సాధించిన తొలి సంస్థ. కరోనా వైరస్‌ను తొలుత గుర్తించిన వుహాన్‌లోనే ఈ వ్యాక్సిన్ అభివృద్ధి జరుగుతోంది. ప్రయోగశాలలో `సార్స్ కోవ్-2` వైరస్‌ను కృత్రిమంగా అభివృద్ధి చేసి దానిని నిర్మూలించే `ఇన్‌యాక్టివేటెడ్` వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు.
బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజిక్స్-సినోఫామ్
సినోఫామ్ సంస్థ అభివృద్ధి చేస్తున్న మరో వ్యాక్సిన్ ఇది. బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజిక్స్‌తో కలిసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సంస్థ నమ్మకంగా చెబుతోంది. ఈ వ్యాక్సిన్ డోసు ధరను 150 డాలర్లుగా నిర్ణయించింది.
మోడెర్నా
అమెరికాకు చెందిన మోడెర్నా జులై 27 నుంచి మూడో దశ ప్రయోగాలు చేస్తోంది. 30 వేల మందిని రిక్రూట్ చేసుకున్నామని, ఈ నెలాఖరుకు మూడో దశ ప్రయోగాలను పూర్తి చేస్తామని సంస్థ ప్రకటించింది. ఇది `ఎమ్-ఆర్‌ఎన్‌ఏ` తరహా వ్యాక్సిన్. అక్టోబర్‌లో ప్రయోగ ఫలితాలను వెల్లడించి డిసెంబర్ నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్ డోసు ధర 32 నుంచి 37 డాలర్లు వుంటుందని, ఏడాదికి 50 కోట్ల డోసులు తయారు చేస్తామని చెబుతోంది. అమెరికా ప్రభుత్వం నుంచి 100 కోట్ల డాలర్ల నిధులు కూడా సంపాదించింది.