చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీకి పెరిగిన జనాదరణతో ఆందోళనకు గురవుతున్న వైఎస్ఆర్ సీపీ చంద్రబాబు ప్రతి అడుగునూ పరిశీలిస్తోంది. చంద్రబాబు వ్యూహాలు, టీడీపీ భవిష్యత్తు కార్యక్రమాలను నిఘా వేసి తెలుసుకుంటోంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండగా, అక్కడికి కూడా జగన్ తన వేగులను పంపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కానప్పటికీ వైఎస్ జగన్ తన టీమ్‌ను ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు అంటే వైఎస్ఆర్ సీపీ కి ఎంత భయం ఉందో అర్థం అవుతోంది.
చంద్రబాబు ఢిల్లీకి రాజకీయ ప్రముఖులను కలవడానికి వెళ్లడం లేదు. అసలు ఇది రాజకీయ పర్యటన కానేకాదు. ఓ పెళ్లికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఢిల్లీలో అడ్వకేట్ సిద్దార్ధ్ లూధ్రా కుమారుడి వివాహ మహోత్సవం సోమవారం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరుకానున్నారు. చంద్రబాబును నిందితుడిగా చేర్చిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అడ్వకేట్ సిద్ధార్థ్ లుధ్రానే వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ చనువుతో లుధ్రా చంద్రబాబు దంపతులను కూడా ఆహ్వానించగా, చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మాత్రం దానికే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనగానే ఆయన ఎవరెవర్ని కలుస్తారో అనే అనుమానాలు జగన్‌లో మొదలైనట్లు కనిపిస్తాయి.
అందుకే, తన నిఘా టీమ్‌ని జగన్ ఢిల్లీకి పంపినట్లుగా తెలుస్తోంది. వివాహానికి హాజరు కావడమే కాక, ఇంకా అక్కడ చంద్రబాబు ఎవరెవరిని కలవనున్నారు? ఎవరెవరితో చర్చలు జరపనున్నారు అనే అంశాలపై ఫోకస్ చెయ్యడానికి నిఘా టీమ్ ఢిల్లీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వేనే ఆ పార్టీ ఓడిపోతున్నట్లుగా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ కార్యక్రమాలపైనే కాకుండా, చంద్రబాబు వేసే అడుగులపై కూడా జగన్ నిఘా పెట్టినట్లు సమాచారం.











