ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో గుబులు పట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ ఎఫెక్ట్ వల్ల వీరు కలవరపడుతున్నారు. కాంగ్రెస్ సత్తా చాటితే ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఓడిపోవడం ఖాయమని వారు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు. జగన్ అండ్ ముఠాకి బాగా సహకరించిన సీనియర్ అధికారులు వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మారడం తప్పదనే భావనతో వారు రాష్ట్రం నుంచి బయటపడాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తే జగన్ కు సహకరించిన అందరూ అధికారులు చిక్కుల్లో పడ్డట్లే. వివిధ స్కామ్‌లు, అవకతవకలపై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరగడం తలనొప్పి అనుకొని ఎన్నికల లోపే ఏపీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
వీరిలో ముఖ్యంగా సీఐడీ సంజయ్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, సునీల్ కుమార్ పీవీ, గోపాలకృష్ణ ద్వివేది లాంటి సీనియర్లు సహా మరికొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్లాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగా వారు ఇప్పటికే దరఖాస్తులు కూడా చేశారని సమాచారం. ఇక్కడే ఉన్న పక్షంలో ప్రభుత్వం కనుక మారితే.. తాము చిక్కుల్లో పడిపోతామని భావిస్తున్నారు.
పైగా, ప్రస్తుతం సెమీ ఫైనల్ తరహాలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిస్తున్న హవా కూడా ఈ అధికారులకు నిద్ర పట్టనీయడం లేదు. ఈ సెమీఫైనల్ ఫలితాల ప్రభావమే సాధారణ ఎన్నికలపై ఉండే అవకాశం ఉన్నందున.. డిసెంబరు 3న వెల్లడయ్యే ఫలితాల్లో మునుపటి కంటే కాంగ్రెస్ సత్తా చాటితే కనుక కేంద్రంలోని బీజేపీ వ్యూహాలు మారిపోతాయి. ఏపీ విషయానికి వస్తే తీవ్ర వ్యతిరేకత ఉన్న వైఎస్ఆర్ సీపీకి తాము అంతర్గతంగా ఇస్తున్న మద్దతు నిలిపేసి, టీడీపీ-జనసేన కూటమి వైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ కాంగ్రెస్ జోరు కూడా ఉన్నతాధికారులను భయపెడుతోంది.
గత ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చిన అతి భారీ మెజారిటీ వల్ల ఇక వచ్చే ఎన్నికల్లో కూడా తమకు ఢోకా ఉండబోదనే నమ్మకంతో కొంత మంది సీనియర్ అధికారులు ముఖ్యమంత్రికి బాగా సహకరించారు. కానీ, రాష్ట్రంలో సడెన్ గా మారిన రాజకీయ పరిస్థితులు, సర్వేల ఫలితాలతో ఇక ప్రభుత్వం ఊడిపోవడం ఖాయమని వారికి అర్థం అయింది. అందుకే జగన్ తో పాటుగా తాము కూడా చిక్కుల్లో పడకుండా సైడ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది.