మంత్రి నారా లోకేష్కు వస్తున్న ఇంటర్నేషనల్ ఇమేజ్ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ క్రమంలోనే లోకేష్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఫేక్ ప్రచారాలకు దిగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జగన్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటే..మంత్రిగా నారా లోకేష్ పనితీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా వింగ్ పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి తెరలేపింది.
అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ ఇండియాలో మంత్రి లోకేశ్పై ప్రత్యేక వ్యాసం రాయించుకోవడానికి కూటమి ప్రభుత్వం రూ. కోటికి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ..ఓ ఫేక్ జీవోను సృష్టించి వైరల్ చేస్తోంది. అయితే, అధికారిక జీవోలను కుట్రపూరితంగా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పన్నిన ఈ పన్నాగం కాస్తా బెడిసికొట్టింది.
దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ..ఫేక్ ప్రచారాల వెనుక ఉన్న అసలు వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. సోషల్ మీడియాలో వైసీపీ సర్క్యులేట్ చేస్తున్న జీవోకు ఫార్చ్యూన్ ఇండియా పత్రికకు అసలు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వాస్తవానికి, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలను, పారిశ్రామిక సానుకూలతలను అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ CNBC TVతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఛానెల్కు చెల్లింపులు జరపడానికే ఈ జీవో ఇచ్చారని స్పష్టం చేసింది.
CNBC టీవీ, ఫార్చ్యూన్ ఇండియా రెండూ పూర్తిగా భిన్నమైన సంస్థలనే ప్రాథమిక విచక్షణను కూడా మర్చిపోయి వైసీపీ ఈ వికృత ప్రచారానికి ఒడిగట్టింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్న తరుణంలో ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామిక పురోగతిని అడ్డుకోవడంతో పాటు, మంత్రి లోకేశ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే జీవో నంబర్లు, తేదీలను మార్చి ఈ కుట్ర పన్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో హక్కే అయినా.. ఉద్దేశపూర్వకంగా పచ్చి అబద్ధాలను, వక్రీకరించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టించిన వారితో పాటు, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తున్న వారిపైనా చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.











