ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. రేషన్ పంపిణీ చేసిన వారం రోజుల్లో ఆ బియ్యం మొత్తం సేకరించి, మరలా మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఇంకొల్లు వయా పర్చూరు మీదుగా చిలకలూరిపేటలోని వైసీపీ నేతకు చెందిన రైస్ మిల్లుకు రేషన్ చేరిపోతోందని తెలుస్తోంది. కొన్ని రూట్లలో పోలీసు అధికారులతో ముందుగానే బేరాలు మాట్లాడుకుని ఆ రూట్లలోనే అక్రమ రవాణా సాగిస్తున్నారని సమాచారం. అయితే ఆ రూట్లలో కూడా పైలెట్ వాహనం పెట్టి మరీ మాఫియా చెలరేగిపోతోందనే సమాచారం వస్తోంది.
బైక్ పై ముందే చెకింగ్
బియ్యం తరలించే ముందుగా బైక్ పై ఇద్దరు వ్యక్తులను ఆ రూట్లో ఎక్కడైనా రెవెన్యూ, పోలీస్ చెకింగ్ నడుస్తోందా? లేదా? అనే విషయాలను నిర్దరించుకుంటున్నారు. ఎక్కడైనా చెకింగ్ అవుతూ ఉంటే అక్రమ బియ్యం లారీ డ్రైవర్ కు సమాచారం అందిపోతుంది. వెంటనే ఆ లారీని వేరే రూట్లో తీసుకెళుతూ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులకు విషయం తెలిసినా, వారికి ముందే ముడుపులు ముట్టడంతో వారు మిన్నకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ట్యాంకర్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా
అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మామూలు లారీల్లో బియ్యం తరలిస్తే పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు చెకింగ్స్ లో దొరికిపోయే అవకాశం ఉండటంతో కొందరు అక్రమార్కులు నీటి సరఫరాకు ఉపయోగించే ట్యాంకర్లను బియ్యం అక్రమ రవాణాకు వాడుతున్నారని తెలుస్తోంది. కొన్ని స్టేషన్లలో పోలీసులతో ముందే మాట్లాడుకోవడంతోపాటు, ఇంకొల్లు చిలకలూరిపేట రూట్లో అక్రమార్కులకు అడ్డే లేకుండా చేసుకున్నారనే సమాచారం అందుతోంది. ఈ రూట్లో ప్రతి రోజూ 10 లారీల బియ్యం చిలకలూరిపేట మిల్లులకు చేరుతోంది. అక్కడకు చేరిన వెంటనే వాటిని పాలిష్ వేసి గుర్తుపట్టకుండా చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయరా?
ఏపీలో లబ్దిదారులకు కిలో రేషన్ బియ్యం రూపాయికే ఇస్తున్నారు. వారు వాటిని వెంటనే కిలో పది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పద్నాలుగు రూపాయలకు అక్రమ రవాణాదారులకు చేరవేస్తున్నారు. వాటినే మరలా పాలిష్ వేసి కిలో రూ.26కు మరలా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇలా బియ్యం రీ సైక్లింగ్ వల్ల అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. చివరకు కోళ్లదాణాగా వాడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు వినియోగించే రకాలను రేషన్ లో ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు.











