ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన మార్క్ చూపిస్తోంది. తాజాగా విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అక్షరాస్యత రేటు అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. 2024లో కేవలం 72.6 శాతంగా ఉన్న అక్షరాస్యత రేటు, తాజా గణాంకాల ప్రకారం 2026 నాటికి ఏకంగా 82.1 శాతానికి దూసుకెళ్లింది. మొన్నటి వరకు దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీ, కేవలం రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే జాతీయ సగటును దాటి ఈ మైలురాయిని అందుకుంది.
ఈ భారీ విజయానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రధాన కారణం. ఈ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది పెద్దలు అక్షరాస్యతను అభ్యసించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షల ఫలితాల్లో రాష్ట్రం దాదాపు 10 శాతం వృద్ధిని సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని, ఏకంగా 11 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు.
కేవలం వయోజన విద్యే కాకుండా, పాఠశాల విద్యపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. బడి వెలుపల ఉన్న ప్రతి చిన్నారిని గుర్తించి మళ్లీ బడికి చేర్చేలా LEAP యాప్ ద్వారా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మాటల కంటే చేతలే ముఖ్యమని నిరూపిస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రస్తుత ఊపును కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. సెప్టెంబర్ 2027 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో మరో 50 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలో ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఏపీ అక్షరాస్యత వృద్ధి దేశానికి రోల్‌మోడల్‌లా నిలిచింది.











