సినిమా రంగంలో ఓ వెలుగు వెలగాలంటే ఆవకాయంతైనా అదృష్టం ఉండాలంటారు. భవిష్యత్తులో దురదృష్టం వెంటాడినా అందరూ గుర్తుంచుకునేది మాత్రం అదృష్టాన్నే. నటి సౌందర్య సినిమా రంగంలో ఎంతటి వెలుగు వెలిగిందో అందరికీ తెలిసిందే.
అదృష్ట, దురదృష్టాలు రెండూ ఆమె జీవితంతో దోబూచులాట ఆడాయి. అందుకే ఆమె ఎంతగా వెలిగిందో అంత త్వరగానే కనుమరుగైంది. సౌందర్య సినిమా జీవితం నాటకీయంగానే జరిగింది. డాక్టర్ కాబోయిన ఆమె యాక్టరైంది. బెంగళూరుకు చెందిన సౌందర్య అసలు పేరు సౌందర్య. సినిమా కోసం ఆమె సత్యనారాయణ సౌందర్య అని ఆమెకు పేరు మార్చారు. ఒక విధంగా అలా మార్చమని చెప్పింది కూడా ఏ జ్యోతిష్కుడో అయి ఉంటాడు. ఎందుకంటే జాతకాలంటే అంత పిచ్చినమ్మకం ఆయనకు. కన్నడ చిత్రం ‘గంధర్వ’లో ఆమె ఓ చిన్న పాత్ర మాత్రమే పోషించింది. నిజానికి ఆమె హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’.

తొలి సినిమా అడ్వాన్స్..
సౌందర్య తొలి సినిమా పారితోషికం రూ. 25వేలు. అడ్వాన్స్ గా దర్శకుడు త్రిపురనేని చిట్టి ఇచ్చింది ఐదువేల రూపాయలు. ఐదు వేల రూపాయల చెక్కును చిట్టి సౌందర్య తండ్రికి ఇవ్వగానే ఆయన అన్న మాటలు ‘ఇవ్వాళ మీరు రేపటి అగ్ర హీరోయిన్ కు అడ్వాన్స్ ఇచ్చారు’ అనగానే గతుక్కుమన్నారు చిట్టి. ‘ఇది నా కూతురు మీద ప్రేమతో అనే మాట కాదు.. నా కూతురి జాతకం అలా ఉంది. 12 ఏళ్లు నా కూతురు ఇండియాలోని అగ్రహీరోలు అందరితోనూ నటిస్తుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు’ అంటూ తొలి సినిమా అడ్వాన్స్ తీసుకున్న రోజే సత్యనారాయణ అనేశారు. ఆయన అలా అనగానే 12 ఏళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకుని ఆమె సినిమాలకు స్వస్తి చెప్పేస్తుందేమో అనుకున్నారు చిట్టి. ఆయనలా ఎందుకన్నారో తెలియదుగానీ కచ్చితంగా 12 ఏళ్ల తర్వాత సౌందర్య కనుమరుగైంది.
అవకాశం వచ్చింది ఇలా..
సౌందర్యకు సినిమా అవకాశం రావడం కూడా తమాషాగానే జరిగింది. 1992లో ‘రైతు భారతం’లో భానుచందర్ పక్కన కొత్త హీరోయిన్ ను పెట్టాలన్న ఆలోచన చిట్టికి వచ్చింది. మొదట ఆ పాత్రకు రోజాని అనుకున్నారు. అప్పటికి రోజా ఒక్క సినిమా మాత్రమే చేసింది. రోజా వాళ్ల నాన్న మద్రాసులోని ఆంధ్రా క్లబ్ కు తరచూ వస్తుంటారు. అయితే రోజాని చిట్టి కలిసే అవకాశం రాలేదు. ఈలోగా ఎడిటర్ రామయ్య కలిసి‘అన్నా నువ్వు హీరోయిన్ ను వెతుకుతున్నావని తెలిసింది. ఇక్కడొక పిల్ల ఉంది.. అమ్మాయి బాగుంది.. ఫోన్లో కాదు, ఫొటోలు కాదు నువ్వు నేరుగా వచ్చేస్తే చూపిస్తా’ అనడంతో బెంగళూరు వెళ్లారు చిట్టి.
సౌందర్య తండ్రి సత్యనారాయణ అమ్మాయిని పిలిపిస్తానంటే ‘వద్దండీ నేనే వస్తా’ అని వారి ఇంటికి వెళ్లారు. ఉదయం ఆరున్నరకే సౌందర్య ఇంటి వద్ద వాలారు. అమ్మాయిని నాచురల్ గా చూడాలన్నది ఆయన ఉద్దేశం. ఆమె ఎలా ఉండాలని ఆయన ఊహించుకుని వెళ్లారో ఆమెను చూడగానే అలాగే ఉంది. ‘ఆ పిల్ల ఏడుస్తుంటే అయ్యో నా చెల్లి ఏడ్చిందే .. నా బిడ్డ ఏడ్చిందే అనేలా ఉండాలనుకున్నా. నా మేథో ఫలకం మీద ఏదైతే ఊహించుకున్నానో ఆ రూపమే కనిపించింది. అందుకే నాకు మూడు సినిమాలు చేశాకే బయటికి వారికి సినిమాలు చేయాలి అనే షరతు పెట్టా’ అని వివరించారు త్రిపురనేని చిట్టి. వేరే వారు బలవంతం చేయడంతో ఆ మిగిలిన రెండు సినిమాలు వేరే వారికి చేయడానికి అంగీకరించారట. ‘మనవరాలి పెళ్లి’ వాటిలో ఒకటి.
Also Read ;- విడాకులు మంజూరు కాగానే హీరోయిన్ సరిత కోర్టులో కళ్లు తిరిగిపడిపోయిందా..?

ఆ మూడూ మన చేతిలో ఉండవట?
అన్నీ మన చేతుల్లోనే ఉంటాయని అందరూ అనుకుంటారుగానీ ఆ మూడు మన చేతుల్లో ఉండవట. వాటిలో మొదటిది కళ్యాణం, రెండోది జననం, మూడోది మరణం. సౌందర్య మరణాన్ని గుర్తుచేసుకుంటూ త్రిపురనేని చిట్టి అన్న మాటలివి. సౌందర్య తండ్రి చెప్పినట్టుగానే 12 ఏళ్ల తర్వాత హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. అప్పటికి కొద్ది కాలానికి ముందే సౌందర్య వివాహం తన చిన్ననాటి స్నేహితుడు రఘుతో జరిగింది. ఆ పెళ్లికి వెళ్లిన చిట్టి ‘చూశావమ్మా.. నాన్నగారు చెప్పినట్టుగానే జరిగింది. నువ్విక సినిమాలకు దూరమై సెటిలైపోతావన్నమాట.. ’ అన్నారు. దానికి సౌందర్య‘లేదంకుల్ మీరలా అంటారేంటి.. నన్నిప్పుడు తెలుగు ఇండస్ట్రీగానీ, తమిళ ఇండస్ట్రీగానీ వదులుతుందా?.. నేను చచ్చేదాకా యాక్ట్ చేస్తాను’అంది.
తథాస్తు దేవతలు ఆ మాటలు విన్నారేమో ఆమె అన్నట్టుగానే జరిగింది. సౌందర్యతో తనదే మొదటి సినిమా.. తనదే ఆఖరి సినిమా అంటారు చిట్టి. ఆఖరి షూటింగ్ కూడా ఆయనకే చేసింది సౌందర్య. ఆ సినిమా పేరు ‘గెలుపు’. ఇందులో ఆమె జడ్జిగా నటించింది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేశారు. ఇందులో ఆమెది గెస్ట్ పాత్ర. చాలామంది ‘మీరింత వరకూ ఎవ్వరికీ గెస్ట్ వేషం వేయలేదు.. చిట్టిబాబు గారి సినిమాలో ఎందుకు వేస్తున్నారు?’ అని. అందుకు ఆమె చెప్పిన సమాధానం వింటే తనకు ఇప్పటికీ కళ్లు చెమ్మగిల్లతాయన్నారు చిట్టి. ‘నేనీ స్థాయికి రావడానికి మొదటి అడుగు ఆయనే వేయించారు.. ఆయన రుణం తీర్చుకున్నాను’ అందట సౌందర్య.
‘నేను అడగ్గానే ఏం వేషం.. పాత్ర ఏమిటి? ఎంతిస్తారు? లాంటి వేమీ అడగలేదు. నా రుణం తీర్చుకున్నాను అని ఆ పిల్ల అనుకుండా ఉంటే బాగుండేదేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నా రుణం అలాగే ఉన్నా ఆమె బతికి ఉండేదేమో. ఆమె జీవితం ముగింపునకు కూడా నేనే కారకుడిని’ అంటూ బాధపడ్డారు చిట్టి ‘లియో’ ఇంటర్వ్యూలో. ఆమె జీవితం ఆరంభానికీ అంతానికీ మూలం నేనే కావడం బాధగానే ఉంటుందంటారు. ఆమెను భాజపా ఎన్నికల ప్రచారానికి రమ్మని పిలిచింది కూడా ఆయనేనట.
కరీంనగర్ వెళ్లి భాజపా అభ్యర్థి విద్యాసాగర్ రావుకు ప్రచారం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చి కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలకు ప్రచారం చేసి మద్రాసులో తమిళ సినిమా షూటింగ్ కు ఆమె వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆమె ఓ హెలీకాప్టర్ బుక్ చేసింది. అప్పటిదాకా ఆ హెలీకాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది. దాన్ని ఆయన ఎక్స్ టెండ్ చేసుకోవడంతో రద్దయ్యింది. ‘2.30కు జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ ఉందమ్మా.. అందులో వచ్చేయండి’ అన్నారు చిట్టి. దాంతో ఆమె అన్నయ్య అమర్ ‘ఏంటి మీరిలా విమానం అంటారు.. విజయశాంతి హెలీకాప్టర్ లో తిరిగింది.. మీ హీరోయిన్ విజయశాంతికన్నా తక్కువా.. అంత స్ట్రెయిన్ అవ్వమంటారేంటి?’ అన్నాడు.
నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నాకు అందరు హీరోయిన్లకన్నా ఎక్కువే. హెలీకాప్టర్ లేదు కదా.. అందుకే అలా అన్నానన్నారు చిట్టి. తన ఫ్రెండ్ హెలీకాప్టర్ ఉందన్నాడు అమర్. టూ సీటర్ హెలీకాప్టర్ అది. దాన్నే బుక్ చేశారు. పెద్ద హెలీకాప్టర్ కోసం ఆమె ఎక్కువ లగేజీ తెచ్చుకుంది. స్టాఫ్ తో పంపాల్సిన లగేజి అంతా వెనక్కి పంపడం ఇష్టం లేక ఆ హెలీకాప్టర్ లోకి ఎక్కించేశారు. ఫైవ్ సీటర్ లో పట్టాల్సిన సామగ్రి టూ సీటర్ లో పెట్టడం కూడా ఒక తప్పిదమే. అంత లగేజీ పెట్టకూడదని సిబ్బింది కూడా చెప్పలేదు. టేకాఫ్ తీసుకోగానే ఆ లగేజీ వెనక్కి జరిగిపోవడం, హెలీకాప్టర్ కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయింది.
‘బతికినంత కాలం రాణి లాగానే బతికింది. ఎవ్వరి దగ్గరా ఒక్క మాట అనిపించుకోలేదు. తొలి రోజు నేను మేకప్ వేయించిన రోజు ఆమె కెమెరా ముందుకు రావడానికి భయపడింది. భానుచందర్ తో మొదటి షాట్.. ఏడ్చేసింది.. నేను చెయ్యను అంది. కన్విన్స్ చేయడం డైరెక్టర్ గా మీ ఇష్టం..చెయ్యను అంటే నేను బలవంతం ఒప్పించలేను అని ఆమె తండ్రి అన్నారు’ అని చిట్టి వివరించారు. దాంతో సినిమా వాతావారణం అలవాటవ్వాలని నా కుటుంబ సభ్యులు అందరినీ ఆమె గెస్ట్ వద్ద ఉంచి షూటింగ్ వారం రోజులు వాయిదా వేశారు చిట్టి.
‘అమ్మా నువ్వు ఎక్స్ పోజింగ్ జీవితంలో చెయ్యవద్దు. నీ ఫేస్ కి ఎక్స్ పోజింగ్ పనికి రాదు. అమ్మాయి బంగారం అనుకునే ఫేస్ నీది గ్లామర్ వేరు అందం వేరు.. నీది అందం. నిండుగా ఉన్నంతకాలం నిన్ను అంతా మా ఇంటి పిల్ల అంటారు. ఆ మాటను తు.చ. తప్పకుండా పాటించింది. గ్లామర్ కావాలని ఓ అగ్రదర్శకుడు అడిగినా వేసుకోలేదు. ఎలాంటి వివాదాలు లేని కెరీర్. ఆమె చనిపోవడానికి నేనూ ఒక కారకుడినయ్యానే అనే బాధ కూడా నాకుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిట్టి. వచ్చే నెల 18వ తేదీ సౌందర్య పుట్టిన రోజు. ఆ నట సౌందర్యం అర్ధాంతరంగా కనుమరుగై పోయింది.
– హేమసుందర్
Must Read ;- అభిమానులకు బాలయ్య ‘అఖండ’మైన పుట్టినరోజు కానుక











