ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి కృష్ణా నది జలాలను నల్లమలసాగర్‌కు తరలించి.. అక్కడి నుంచి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు.. విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ వాటాగా రావాల్సిన నీటిని కూడా ఏపీకి తరలిస్తున్నారని.. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉన్నారని ఆరోపించారు. వెలిగొండ.. మనకు గుదిబండ అని హరీశ్‌రావు చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ నాయకుల కంటే ముందే.. వెలిగొండ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా వైసీపీ నుంచి ఆరోపణలు వచ్చాయి. వెలిగొండతో రాయలసీమకు నష్టం జరుగుతుందని.. ఆ ప్రాజెక్టుని ముట్టడిస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులకు తోడు తెలంగాణకి చెందిన బీఆర్ఎస్ నేతలు వెలిగొండకు వ్యతిరేకంగా గొంతు కలిపారు.
ఏపీలో కీలకమైన నీటి పారుదల ప్రాజక్టులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, వైసీపీ నాయకులు కలిసికట్టుగా గళమెత్తడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు.. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రారంభించడానికి ప్రయత్నించిన సమయంలోనూ.. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ వ్యతిరేకించింది. గోదావరి జలాల్లో తెలంగాణకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపించగా.. ఏపీకి చెందిన వైసీపీ నేతలు అంత భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టుతో రాష్ట్రానికి మేలు జరగదని వాదించారు.
వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ కొట్టేయడానికి ఉత్సాహంగా సోషల్ మీడియాలో ట్వీట్లు, సొంత పత్రికలో కథనాలు వేసుకున్న జగన్ అండ్ కో.. బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న విమర్శలపై మౌనం పాటిస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. సొంత రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటికి తీవ్ర కొరత ఏర్పడిన సమయంలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కూటమి ప్రభుత్వం కరువు ప్రాంతాలకు నీరు అందిస్తుంటే.. పొరుగు రాష్ట్రం నాయకులతో కలిసి వైసీపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను రైతులు గమనిస్తూనే ఉన్నారు. కరువు కాలంలో రెండు రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటిని సమర్ధంగా వినియోగించుకోవాలని సామాన్య ప్రజలకు కోరుకొంటున్నారు.











