సౌత్ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా దిగ్గజ సంస్థ HD హ్యుందాయ్ ప్రతిపాదిత మెగా షిప్‌యార్డ్ ప్రాజెక్ట్‌ను తమిళనాడు నుంచి కాకినాడకు రప్పించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 38,000 కోట్ల భారీ పెట్టుబడితో పాటు 15,000 మందికి ప్రత్యక్షంగా, మరో 45,000 నుంచి 75,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంతటి భారీ ప్రాజెక్ట్ చేజారిపోతుండటంతో ఇప్పుడు తమిళనాడు యువత ఆగ్రహంగా ఉంది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి నష్టం చేకూరుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులే మాకు అన్నింటికంటే ముఖ్యం అనే ఉద్దేశంతో SIPCOT పార్కుల కోసం ఎలాంటి సాగు భూమిని సేకరించబోమని ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ప్రకటించడం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమయ్యే హ్యుందాయ్ లాంటి భారీ ప్రాజెక్టులకు ఇది సవాల్. అంతేకాకుండా, పరాందూర్ విమానాశ్రయం వంటి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను రద్దు చేయడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని సడలింపజేస్తోంది.
ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు, కేంద్రంపై ఒత్తిడి తెస్తూ అందిస్తున్న మెరుగైన రాయితీలు పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. తూత్తుకూడికి రావాల్సిన ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం కాకినాడ వైపు మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే, అది ఏపీకి మరో పెద్ద విజయంగా మారుతుంది. ఏపీ నాయకత్వం చూపుతున్న చొరవను సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసిస్తుండగా, తమిళనాడు ప్రభుత్వం వైఖరిపై స్థానిక యువత, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో లోకేష్ పని తీరును, ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.
ఈ పరిణామాలు దక్షిణాది రాజకీయాల్లోనూ, పారిశ్రామిక వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. పొరుగు రాష్ట్రాల పెట్టుబడులపై ఏపీ ప్రత్యేక దృష్టి సారించడం, వేగవంతమైన అనుమతులు ఇస్తుండటం వల్ల మెగా ప్రాజెక్టులు ఇటువైపు క్యూ కడుతున్నాయి. తమిళనాడులో మాత్రం ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం రూ. 38 వేల కోట్ల భారీ పెట్టుబడిని, వేలాది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అక్కడి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.











