ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కరవు నేలపై సరికొత్త చరిత్ర లిఖించింది. దశాబ్దాలుగా ఫ్లోరైడ్ రక్కసితో, తాగునీటి కష్టాలతో అల్లాడిన ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తూ సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద కొల్లం వాగు జలాశయం నుంచి జంట సొరంగాల గుండా ఫీడర్ ఛానల్ ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్‌లోకి ఉరకలు వేస్తున్న దృశ్యం స్థానికులను ఉద్వేగానికి గురిచేసింది.
మొత్తం రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందనుంది. మొదటి దశ కింద నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీరు చేరుకోనుండగా, తక్షణమే 1.19 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుబాటులోకి రానుంది.
1996 మార్చి 5న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రిగా, మళ్లీ 2026 ఆగస్టు 31న దాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేయడం తన అదృష్టమని చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇళ్లు, ఊళ్లు, భూములు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు వేదిక పైనుంచే పాదాభివందనం చేశారు. వారి త్యాగాల వల్లే నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని కొనియాడారు. నిర్వాసితులను ఆదుకోవడంలోనూ రికార్డు వేగం కనబరిచామని, కేవలం 48 రోజుల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. కటాఫ్ డేట్ పెంచి అదనంగా ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 2.77 శాతం పనులు మాత్రమే జరిగాయని, ఎన్నికల ముందు పైలాన్లు పెట్టి డ్రామాలాడారని విమర్శించారు. లక్ష కోట్లతో సెప్టెంబరులో ప్రారంభించబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో మార్కాపురం జిల్లాను భాగం చేశామని, ఇక మార్కాపురం అభివృద్ధి అన్‌స్టాపబుల్ అని సీఎం ప్రకటించారు.
వెలిగొండ కృష్ణమ్మ ఉరకలను చూసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు నేరుగా చెన్నై నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ఆనంద క్షణాన్ని చూడలేదంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహించిందని, ఎన్నికలు సమీపించాక జాతికి అంకితం చేసినట్లు డ్రామాలాడిన మూర్ఖుడు జగన్ అంటూ మండిపడ్డారు. పట్టుదలతో కేవలం రెండున్నరేళ్లలో రూ.2 వేల కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేయడంతో పాటు, రెండు నెలల వ్యవధిలోనే నిర్వాసితులకు రూ.900 కోట్ల పునరావాస ప్యాకేజీ అందించడం దేశంలో చంద్రబాబుకే సాధ్యమైందని మాగుంట కొనియాడారు.











