(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను పరిపాలన రాజధానిగా కొత్త ప్రభుత్వం ప్రకటించాక జరుగుతున్న వరుస పరిణామాలు ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇందుకు కారణమవుతున్నాయి. విశాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న పరిశ్రమలున్నాయి. తూర్పు నావికా దళ ప్రధాన కార్యాలయం, dockyard, NAD, NSTL లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ నెలకొన్నాయి.
వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు సంధించిన మొదటి ప్రశ్న ‘భద్రత’? ప్రశాంతమైన విశాఖ నగరంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సువిశాల తీర ప్రాంతం ఉన్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నెలకొల్పడం వల్ల- సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రమాద తీవ్రత, నష్టం ఎలా ఉంటుందనే అంశం ఇటీవల తెరపైకి వచ్చింది.
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు… రాజధాని ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం లో రాజకీయ పక్షాలు ముందువరుసలో నిలబడ్డాయి. ఇటువంటి వాదప్రతివాదనలు జరుగుతున్న తరుణంలో… విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన యావత్ దేశ ప్రజల దృష్టిని ఇటు వైపు మళ్లించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడగా, వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులు మూడు రాజధానులు అంశాన్ని హైలెట్ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ విశాఖ లోని ఏదో ఒక పరిశ్రమలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఇది కాస్త ఒక రకమైన సెంటిమెంట్ కు దారితీస్తుందని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
విశాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండు మూడు నెలల్లో అనేక ప్రమాదాలు జరగడమే ప్రధాన కారణం. ఎల్జి పాలిమర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ రెండు పరిశ్రమల్లోనూ గతంలో ఎన్నడూ చోటు చేసుకోని దుర్ఘటనలు సంభవించాయి. విశాఖను అభివృద్ధి చేస్తామని, విశాఖ అభివృద్ధి చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ నిందించిన ప్రతిసారి విశాఖలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది.
ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఫార్మాసిటీలో వరుసగా రెండు ప్రమాదాలు సంభవించాయి. అచ్యుతాపురంలో మరో సంఘటన… అది మరువకముందే హిందుస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలిపోయి పది మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే షీలా నగర్ లోని ఓ కంటైనర్ సంస్థలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తేనే ఇంత అనర్థం జరుగుతోంది… పాలనా ప్రక్రియ ప్రారంభం అయితే మన పరిస్థితి ఏంటి? అన్న అనుమానం చాలామందిలో ఇటీవలకాలంలో వ్యక్తమవుతోంది.
శాస్త్రీయంగా ఈ వాదన నిలబడదు. కానీ కొందరిలో అలాంటి సెంటిమెంట్ ఏర్పడుతున్నదాన్ని కాదనలేం. సెంటిమెంట్ ను కాదని వితండవాదం చేయడం కూడా సమంజసం కాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు కురవవు అని.. అనావృష్టి తప్పదని సెంటిమెంట్ ప్రజల్లో ఉండేది. ఆ అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కూడా బాగానే ప్రచారం చేసేది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ మరో రకమైన సెంటిమెంట్ బలపడుతోంది.
విశాఖ పారిశ్రామిక రంగంలో వరుస ప్రమాదాలు జగన్ పాలన పై… గుంటూరు రమేష్ హాస్పిటల్ ప్రమాదం వంటివి అటువంటి సెంటిమెంట్ కే దారితీస్తున్నాయి. ఈయన పాలనలో అన్ని అనర్థాలే… అన్న సెంటిమెంట్ కు తెర లేపుతున్నాయి. పరిపాలన రాజధాని ప్రకటనకే ఇన్ని విపత్తులు సంభవిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో? అన్న ఆందోళన, భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.











