మారుతున్న కాలానికి అనుగుణంగా నటీనటులు .. తమ పాత్రల్ని మార్చుకోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. నిన్నటి తరం టాప్ హీరోయిన్స్ పలువురు ఈ విషయాన్ని గుర్తించడం అభినందనీయం. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నటీమణులు ఇప్పటి జెనరేషన్ హీరోలకు అమ్మగా, అత్తగా నటించడం మెచ్చుకోతగ్గదే. గతంలో యన్టీఆర్, ఏఎన్నార్ , శోభన్ బాబు, కృష్ణ లాంటి టాప్ హీరోయిన్స్ సరసన కథానాయికగా నటించిన అభినేత్రి వాణిశ్రీ .. ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున లకు అత్తగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే జయప్రద, జయసుధ, జయచిత్ర, లక్ష్మి లాంటి అలనాటి కథానాయికలు సైతం ఆ తర్వాత కాలంలో అమ్మగానూ, అత్తగానూ మెప్పించారు.
ఇక నైంటీస్ లో టాలీవుడ్ లో అందరు అగ్రహీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ, నగ్మా, రోజా, సుకన్య, అమల లాంటి కథానాయికలు.. ఆ తర్వాత తరంలో అమ్మలు, అత్తలు అయ్యారు. అలాగే… వారికాలంలోనే హీరోయిన్స్ గా కోలీవుడ్ , టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఓ వెలుగు వెలిగిన పవిత్రా లోకేష్, శరణ్య, ప్రగతి, వినయ్ ప్రసాద్ లాంటి కథానాయికలు సైతం ఆ తర్వాత తరానికి అమ్మ, అత్త అయ్యారు. ఇక కథానాయిక నదియా గురించి తెలిసిందే.. ఆమె కూడా వీరి కాలంలోనే సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ‘అత్తారింటికి దారేది, అ, ఆ’ సినిమాల్లో హీరోలకు అత్తగా మెప్పించింది.
ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్ బస్టర్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బన్నీకి తల్లిగా నటించిన టబు కూడా ఒకప్పటి టాప్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్ ల సరసన హీరోయిన్ గా నటించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ గ్లామర్ బ్యూటీ మరెవరో కాదు సిమ్రాన్. అప్పటి తరం ప్రేక్షకులు .. పర్టిక్యులర్ గా సిమ్రాన్ అందచందాలు చూడ్డానికే థియేటర్స్ కు వెళ్ళేవారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఆమె ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది.
అలాంటి భామ .. ఇప్పుడో యంగ్ హీరోకు అత్తగా నటించనుండడం హాట్ టాపిక్ అయింది. సినిమా పేరు ‘రొమాంటిక్’. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరో. ముంబై భామ కేతికా శర్మ కథానాయిక. ఇందులో సిమ్రాన్ .. కేతికకు అమ్మగా నటిస్తోందట. అంటే ఆకాష్ కు అత్తే కదా. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది. లాక్ డౌన్ వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మరి ఈ సినిమా సిమ్రాన్ ను అత్తగా ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.











