భారీ అంచనాల మధ్య నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా ‘వి’ డైరెక్ట్ గా ఓటీటీలో సెప్టెంబర్ 5న విడుదలయింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగటివ్ రివ్యూస్ వస్తున్నాయి. బలహీనమైన కథకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇవ్వడంలో విఫలమైన ఇంద్రగంటి ఈ సినిమా పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. నాని తన సహజ నటనతో ఆకట్టుకోగా సుధీర్ బాబు పర్వాలేదనిపించారు. నివేదా థామస్, అదితి రావు హైదరి పాత్రలకు పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. పేలవమైన సంబాషణలకు అమిత్ త్రివేది ఇచ్చిన పాటలు కూడా వినసొంపుగా లేకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగటివ్ రెస్పాన్స్ రావడం నిర్మాత దిల్ రాజుకు షాక్ తగిలింది. ఈ సినిమా విషయంలో కెమరామెన్ పీజీ విందాపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తుండగా నేపధ్య సంగీతాన్ని అందించిన తమన్ ను మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
‘కిక్’ సినిమాతో కెరీర్ ఆరంభించిన తమన్ కు కెరీర్ లో కాపీ క్యాట్ అంటూ ముద్ర పడింది. ఆ ముద్రను తొలగించుకునేందుకు తమన్ గ్యాప్ తీసుకొని ‘తొలిప్రేమ’ సినిమాతో సత్తా చాటారు. ‘మహానుభావుడు’, ‘అరవింద సమేత’, ‘ప్రతిరోజూ పండగే’, ‘వెంకీ మామ’, ‘అల..వైకుంఠపురంలో’ సినిమాలు చార్ట్ బస్టర్స్ గా నిలిచే సంగీతాన్ని అందించారు. నాని ‘వి’ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించగా తమన్ నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాని ఇంట్రడక్షన్ సన్నివేశానికి తమన్ ఇచ్చిన బీజీఎం విన్నవారికి ఎక్కడో విన్నట్లు గుర్తుకు వస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించిన ‘రాక్షసుడు’ సినిమా థీమ్ సాంగ్ బిట్ ను తమన్ అటు ఇటు మార్చి వాడేశాడు. ముంబైలో చేజ్ సమయంలో తమన్ ‘వైల్డ్ ఫైర్’ అనే వెబ్ సిరీస్ మ్యూజిక్ ను మక్కీకి మక్కీ దింపేశాడు.
నాని బోర్డర్ లో శత్రుసేనలను చంపే సమయంలో ఇటీవలే విడుదలైన ‘పెంగ్విన్’ థీమ్ బిట్ ను లేపేశాడు. థాయిలాండ్ లో రంజిత్ (ఉత్తమన్)ని చంపాలని నాని చేసే ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబు అడ్డుకుంటాడు. ఈ సమయంలో ధనుష్ నటించిన ‘అసురన్’ బీజీఎంని తమన్ వాడేశాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో తమన్ కు వారు మద్దతు కూడా తెలుపుతుండటం విశేషం. తక్కువ సమయంలో బీజీఎం పూర్తి చేయమని చెబితే ఇలాగే ఉంటుందని చిత్ర యూనిట్ పై నెటిజన్స్ నెగటివ్ కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద నానికి పరాజయం అందించిన ‘వి’ సినిమా తమన్ కు కూడా చేదు ఫలితం అందించిందనే చర్చ ఫిలిం వర్గాలలో జరుగుతోంది.











