ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు జూలై 5 నుంచి 11 వరకు జరిగే ఈ 6 రోజుల పర్యటనలో ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే టార్గెట్‌గా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, మరోవైపు అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులతో వరుస భేటీలు అవుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నాల్లో బిజీగా గడుపుతున్నారు.
పర్యటన తొలిరోజే సియోల్‌లో ప్రవాస ఆంధ్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారే ఏపీకి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని ఆయన కొనియాడారు. గతంలో అనంతపురంలో కియా మోటార్స్ సాధించిన అద్భుత విజయమే ఏపీ నమ్మకానికి, పారదర్శకతకు నిదర్శనమని గుర్తుచేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 3S – Speed, Stability, Service మోడల్ విధానాలను వివరించిన లోకేష్..కొరియా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టేలా అక్కడి వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలని తెలుగు కమ్యూనిటీకి పిలుపునిచ్చారు.
భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు అనుగుణంగా ప్రణాళికలను లోకేష్ పంచుకున్నారు. రాష్ట్రంలో చిప్స్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు శాంసంగ్, LG వంటి దిగ్గజాలను ఏపీకి రప్పించేలా సహకరించాలని కోరారు. శ్రీసిటీ, కొప్పర్తి, నాయుడుపేట, వైజాగ్ లలో సిద్ధంగా ఉన్న రెడీ టు యూజ్ ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా, శ్రీసిటీలో ప్లగ్ అండ్ ప్లే కొరియా ఎన్‌క్లేవ్ టౌన్‌షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించడం విశేషం.
ఈ పర్యటనలో భాగంగా కొరియా టెక్ స్టార్టప్‌ల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్, సియోల్ సెమీకండక్టర్స్ వంటి దిగ్గజాల అధినేతలతో వన్-టు-వన్ చర్చలు షెడ్యూల్ అయ్యాయి. LG టవర్స్‌లో LG కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రతినిధులతో జరిగే హై-లెవల్ డిన్నర్ మీటింగ్ ఈ టూర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. సెమీకండక్టర్ ప్యాకేజింగ్, ఆటో-ఈవీ క్లస్టర్ల విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్, షిప్ బిల్డింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో కొరియా నైపుణ్యాన్ని, పెట్టుబడులను ఏపీకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.










