నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ బ్రేక్ వేశారు. సీఎం కార్యాలయం నుంచి పంపిన జాబితాలో లేళ్ల అప్పిరెడ్డి, త్రిమూర్తుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై విచారణ జరిపిన గవర్నర్ కార్యాలయం వారిపై క్రిమినల్ కేసులున్నాయని తేల్చింది. దీంతో నాలుగు రోజుల కిందటే గవర్నర్‌కు జాబితా పంపినా ఆయన సంతకం చేయలేదని తెలుస్తోంది. క్రిమినల్ కేసులు ఉన్న వారిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎలా నియామకం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఫైలు ఆగిపోవడంతో గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇవాళ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏమిటీ కేసులు..
గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవన్నీ విచారణలో ఉన్నాయి. ఓ హత్య కేసులో కూడా అప్పిరెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. అతనిపై పది సంవత్సరాల కిందటే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులతో పాటు, అట్రాసిటీ కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఆ కేసులు కూడ విచారణలో ఉన్నాయి. దీంతో వారిని గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా పంపేందుకు బిష్వభూషణ్ హరిచందన్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం గవర్నర్ ను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- గవర్నర్ కోటాలో వీరికే చోటు.. మర్రికి మళ్లీ మొండి చేయి?











