ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఏపీ సీఎం జగన్ అధికారం చేపట్టింది ఆయన ఉద్యోగం కోసమా? ఏపీ ప్రజల బాగు కోసమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒక వైపు ఏపీకి ఉన్న ట్యాగ్.. ఆంధ్రుల ఆత్మగౌరవం! బహుశ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆత్మగౌరవ నినాదం వినపడక ముందే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డు వరకు పాకించారు. తొడకొట్టి.. జై కొట్టించుకున్నారు. ఆ తర్వాతే, ఇతర రాష్ట్రాలు.. ఆత్మగౌరవ నినాదాలు అందుకున్నాయి. మరి ఇప్పటి వరకు లేని ఆవేదన.. బాధ.. ఇప్పుడు ఏపీ ప్రజలకు కలగుతున్నాయ్! దీనికి కారణం , ఏపీ ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లోనే కాదు, పొరుగున ఉన్న మన దాయాది రాష్ట్రం తెలంగాణ నేలపై కూడా మోకరిల్లుతున్నందునే!!
ప్రభుత్వ పనులు గమనిస్తే..
ఇలా చెప్పుకొనేందుకు మనసు రావడమే కష్టంగా ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు గమనిస్తే, ఆత్మగౌరవం ఇంకెక్కడ? అనే ప్రశ్న వస్తుంది. గతంలో చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత సచివాలయంలో మనకు రావాల్సిన వాటాలను వదిలేసుకున్నారు. “ఎన్నో వదులుకున్నాం.. ఇది కూడా..“ అంటూ ముక్తాయించారు. అప్పట్లో కొంత నొప్పి తగిలినా, ఇప్పుడు దానికి మించిన బాధ ఏపీ ప్రజలను వేధిస్తోంది. పోలవరం విషయంలో తెలంగాణ అడ్డు పడుతోంది. అసలు పెద్దగా ముంపు ప్రభావితం లేని ఆ రాష్ట్రం ఇటీవల పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అధారిటీ)కి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
పంతం నెగ్గించుకున్న తెలంగాణ
ఇక, ఇటీవల ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో తెలంగాణ తన పంతాన్ని నెగ్గించుకుంది. ప్రజలు, వైశాల్యం పరంగా మనకన్నా తక్కువగా ఉన్న తెలంగాణ వారి ఎక్కువ సర్వీసులు ఏపీలో తిరిగేలా, ఏపీ బస్సులు తెలంగాణలో తక్కువ తిరిగేలా వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. అయినా న్యాయ పోరాటం చేయలేని దుస్థితిలో మన సర్కారు ఉండిపోయింది. ఇక, విద్యుత్ ఉద్యోగుల విభజన ఇప్పటికీ సమస్యగానే ఉంది. ఏపీ విద్యుత్ ఉద్యోగులను తీసుకునేది లేదని, అక్కడి సర్కారు విద్యుత్ సంస్థలను రెచ్చగొడుతోంది. ఇప్పటికే దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేసింది. ఎట్టకేలకు ఒప్పుకొన్నా వేతనాల్లో కోత పెట్టిందనే వార్తలు వచ్చాయి.
ఈ సమస్యను జగన్ సర్కారు పరిష్కరించలేక పోతోంది. ఇక, ఇప్పుడు మరో కీలక సమస్య తెర మీదికి వచ్చింది. విభజన సమయంలో ఏపీ విద్యుత్ వాడుకున్నందుకు తెలంగాణ రూ.5700 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో చంద్రబాబు దీనిపై పట్టుబట్టినా కేసీఆర్ ససేమిరా అన్నారు. ఇంతలో సర్కారు పడిపోయి, జగన్ ప్రభుత్వం గద్దె నెక్కింది. ఇప్పటి వరకు దీనిపై ఒక్కసారంటే ఒక్కసారి మాత్రం, అదికూడా తెలంగాణకు నొప్పి లేకుండా ప్రశ్నించారు. ఇప్పటికీ ఈ సొమ్ముల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇదే మాట తెలంగాణ అధికారులతో అంటే.. మేం లెక్కలు తీస్తే ఏపీనే మాకు చెల్లించాలి.. పోనీలే అని వదిలేస్తున్నాం! అని జాలి మాటలంటున్నారు. ఏపీ మాత్రం సైలెంట్‌గా ఉంది.
ఇక్కడ చిత్రం ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చుకుంటాము, అనుమతివ్వాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం వెంటనే మీ రైతులు వాడుతున్న విద్యుత్‌కు మీటర్లు పెట్టి, అప్పుడు అప్పు తెచ్చుకోండి అని జవాబిచ్చింది. దీంతో జగన్ మీటర్ల బిగింపునకు రెడీ అయ్యారు తప్ప, తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 5700 కోట్లు వసూలు చేసుకుంటే అప్పు తేవాల్సిన అవసరం ఉండదని ఆలోచించలేదు. దీంతో మన రైతులను ఇబ్బంది పెట్టాల్సిన పని కూడా లేదనే ఆలోచన చేయలేక పోయారు. మరి ఈ రూ.5700 కోట్లు కూడా వదిలేసుకున్నట్టేనా?!! . చూడాలి ఏం జరుగుతుందో!











